పట్టుబడ్డ రేషన్ బియ్యం లారీ, నిందితుడు రఘుతో సీఐ శివకుమార్‌రెడ్డి, ఎస్‌ఐ ప్రతాప్
పిచ్చాటూరు (చిత్తూరు): లారీ సహా 7.5 టన్నుల అక్రమ రేషన్ బియ్యాన్ని నాగలాపురం ఎస్‌ఐ ప్రతాప్ తన సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. పట్టుబడ్డ రేషన్ బియ్యం లారీ, నిందితులను సత్యవేడు సీఐ శివకుమార్‌రెడ్డి, నాగలాపురం ఎస్‌ఐ ప్రతాప్ మీడియా ముందు ప్రవేశపెట్టారు. నాగలాపురం మీదుగా తమిళనాడుకు అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు స్థానిక పోలీసులకు సమాచారం అందింది. నందనం వద్ద శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఎస్‌ఐ ప్రతాప్ తన సిబ్బందితో మాటు వేశారు. చెన్నై వైపు వెళ్తున్న లారీ (ఏపీ03టీబీ2444)ని తనిఖీ చేయగా 150 బస్తాల (ఒక్కో బస్తా 50 కిలోలు) రేషన్ బియ్యం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
లారీలో ఉన్న పిచ్చాటూరు మండలం కీళపూడికి చెందిన రఘు (46) అనే వ్యక్తిని పోలీసులు పట్టుకోగా అదే గ్రామానికి చెందిన తంగరాజ్ అనే మరో వ్యక్తి పరారయ్యాడు. పట్టుబడ్డ వ్యక్తిని విచారించగా లారీ, బియ్యం టీడీపీ మాజీ ఎంపీపీ భర్త డి.పద్మనాభరాజుకు చెందినవిగా వివరించాడు. లారీ సహా బియ్యాన్ని నాగలాపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రఘురామయ్య, తంగరాజ్‌లతో పాటు టీడీపీకి చెందిన మాజీ ఎంపీపీ భర్త పద్మనాభరాజుపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment