బనశంకరి: చిత్రదుర్గలోని ప్రఖ్యాత మురుఘ మఠాధిపతి శివమూర్తి శరణుస్వామి మఠం ఆవరణలోని హాస్టల్ బాలికలపై అత్యాచారం కేసులో పోలీసులు చార్జిషీట్లో విస్మయకరమైన అంశాలను ప్రస్తావించారు. మత్తుమందు కలిపిన యాపిల్ పండ్లను ఇచ్చి వారు మత్తులోకి జారుకున్నాక అఘాయిత్యాలకు పాల్పడేవాడని పేర్కొన్నారు. ఈ ఏడాది ఆగస్టు ఆఖర్లో లైంగిక దాడులకు పాల్పడినట్లు ఇద్దరు బాలికలు ఆరోపించడం తెలిసిందే. తరువాత వారానికి పోక్సో, ఎస్సీ ఎస్టీ కేసుల కింద శివమూర్తిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ ఉదంతం అంతటా సంచలనం కలిగించింది.
చార్జిషీట్లో ఏముంది?
- ఈ నేపథ్యంలో రెండో పోక్సో కేసు దర్యాప్తు చేపట్టిన డీఎస్‌పీ అనిల్ నేతృత్వంలోని పోలీస్‌బృందం సోమవారం చిత్రదుర్గ నగర రెండవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో 694 పేజీల చార్జిషీట్‌ను సమర్పించారు. ఇందులో పలు అంశాలను సవివరంగా పేర్కొన్నారు.
- హాస్టల్ వార్డెన్ రశ్మి బాలికలను బెదిరించి శివమూర్తి స్వామి వద్దకు పంపేది. యాపిల్ పండ్లలో మత్తు కలిపి బాలికలకు తినిపించేవారు. మత్తులో ఉండగా దారుణాలకు పాల్పడేవారు.
- కార్యాలయం, బెడ్‌రూమ్, బాత్‌రూమ్‌కు బాలికలను తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు.
- దీనిని వ్యతిరేకించే బాలికలను తీవ్రంగా హెచ్చరించి, మఠం పాఠశాల నుంచి ఇళ్లకు పంపేవారు.
- ఈ రకంగా 10 మందికి పైగా బాలికలపై లైంగిక దాడికి పాల్పడినట్లు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. నిత్యం బాలికలపై అఘాయిత్యాలు జరిగేవి.
- మఠం మహిళా వార్డెన్ రశ్మి, కార్యదర్శి పరమశివయ్యలను కూడా నిందితులుగా పేర్కొన్నారు.
- ఈ నెల 5న ఆస్పత్రిలో మురుఘ స్వామికి పురుషత్వ సామర్థ్య పరీక్షలు చేయగా, పాజిటివ్ ఫలితాలు వచ్చాయి.
ఉరి వేయాలి: ఒడనాడి చీఫ్
ఈ ఘటనపై ఒడనాడి సేవా సంస్థ అధ్యక్షుడు పరశురామ్ మాట్లాడుతూ మురుఘ స్వామికి ఉరిశిక్ష విధించాలన్నారు. ఎంత ఒత్తిడి వచ్చినప్పటికీ పోలీసులు బాగా దర్యాప్తు చేశారని, బాధితుల బాధను కోర్టు ముందుంచారని అన్నారు. అలాగే ఏడాది కిందట మఠంలో హత్యకు గురైన బాలిక కేసును బయటకు తేవాలని ఫిర్యాదు చేశామన్నారు. బాలికను హత్య చేసింది ఎవరు అనేదానిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
(చదవండి: నాలుగోసారి ఆడపిల్ల పుట్టిందని..)
Comments
Please login to add a commentAdd a comment