Hyderabad Pub Raid case: Police Investigation With CC Footage In Pub Raid Case - Sakshi
Sakshi News home page

HYD Pub Raid: ఆ మూడు టేబుళ్లే కీలకం!

Published Tue, Apr 5 2022 12:57 PM | Last Updated on Wed, Apr 6 2022 2:58 AM

Police Investigation With CC Footage In Hyderabad Pub Raid  Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని రాడిసన్‌ బ్లూ ప్లాజా హోటల్‌ అధీనంలోని పుడ్డింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లో జరిగిన రేవ్‌ పార్టీ కేసు విచారణలో ‘మూడు టేబుళ్లు’ కీలకంగా మారాయి. శనివారం రాత్రి వీటిని బుక్‌ చేసుకున్న వాళ్లే మాదకద్రవ్యాలు వినియోగించారని బంజారాహిల్స్‌ పోలీసులు అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న పబ్‌ భాగస్వామి అర్జున్‌ వీరమాచినేని చిక్కడంతో జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న మేనేజర్‌ అనిల్‌కుమార్‌ను కూడా కస్టడీలోకి తీసుకుని విచారిస్తే ఈ అంశంలో స్పష్టత వస్తుందని అధికారులు భావిస్తున్నారు.

మరోపక్క ఈ కేసు దర్యాప్తును బంజారాహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వర్‌రావు మంగళవారం అధికారికంగా స్వీకరించారు. హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున ఆ పబ్‌పై దాడి చేసి నటుడు నాగబాబు కుమార్తె కొణిదెల నిహారిక, బిగ్‌బాస్‌ విన్నర్, గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ కొడుకు గల్లా సిద్ధార్థ్‌ తో పాటు మాజీ కేంద్రమంత్రి మనవడు సహా అనేకమందిని అదుపులోకి తీసుకుని విడిచిపెట్టిన విషయం విదితమే. 

ఆ మూడు టేబుళ్లలో 20 మంది! 
టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్న 148 మందిలో 18 మంది పబ్‌ సిబ్బంది కూడా ఉన్నారు. కాగా సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించిన పోలీసులకు స్పష్టమైన ఆధారాలు లభించలేదు. కానీ పబ్‌లో ఓ పక్కగా ఉన్న మూడు టేబుళ్లపై జరిగిన వ్యవహారం అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో మంగళవారం పబ్‌లో పనిచేసే కొందరు ఉద్యోగులను ప్రశ్నించారు.

ఆ మూడు టేబుళ్లను అర్జున్‌ ఆదేశాల మేరకు అభిషేక్‌ కోరిన మీదట మేనేజర్‌ అనిల్‌కుమార్‌ చాలాసేపటి వరకు రిజర్వ్‌ చేసి ఉంచినట్లు పోలీసులు తెలుసుకున్నారు. రాత్రి 12.30 గంటల ప్రాంతంలో 15 నుంచి 20 మంది వచ్చారని, వారిని లోపలకు తీసుకురావడానికి అనిల్‌ స్వయంగా పబ్‌ ప్రధాన ద్వారం వరకు వెళ్లారని ఓ ఉద్యోగి వెల్లడించాడు. పబ్‌లో ఉన్న ఉద్యోగుల్లో ఇద్దరు మాత్రమే ఆ మూడు టేబుళ్లకు సర్వ్‌ చేశారని, మిగిలిన వాళ్లను అనిల్‌ ఆ దరిదాపులకు కూడా రానీయలేదని చెప్పాడు.  

కౌంటర్‌ నుంచే కొకైన్‌ అందించాడా? 
పబ్‌లో సోదాలు చేసిన సందర్భంలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అనిల్‌కుమార్‌ అధీనంలోని లిక్కర్‌ కౌంటర్‌ పైన ఉన్న స్ట్రాల డబ్బా నుంచి ఐదు కొకైన్‌ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. దీనికి ముందే దాదాపు 10 నుంచి 15 ప్యాకెట్లు ఆ మూడు టేబుళ్లలో కూర్చున్న వారికి అనిల్‌ అందించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనిల్, అభిషేక్‌ల పోలీసు కస్టడీపై బుధవారం కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అనిల్‌ కస్టడీకి వచ్చిన తర్వాత ఈ కోణంలోనే ప్రశ్నించాలని పోలీసులు నిర్ణయించారు. మరోవైపు ఆ మూడు టేబుళ్లపై కూర్చున్న వారిని గుర్తించడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement