అఖిలప్రియను కస్టడీకి ఇవ్వండి  | Police Petition Over Akhila Priya Custody | Sakshi
Sakshi News home page

అఖిలప్రియను కస్టడీకి ఇవ్వండి 

Published Sat, Jan 9 2021 8:57 AM | Last Updated on Sat, Jan 9 2021 8:57 AM

Police Petition Over Akhila Priya Custody - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఏపీ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అఖిలప్రియను తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు శుక్రవారం సికింద్రాబాద్‌లోని కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టడానికి ఆమెను వారంరోజుల పాటు విచారించాల్సి ఉందని పోలీసులు న్యాయస్థానాకి తెలిపారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న అఖిల ప్రియ అనుచరులు మరికొన్ని నేరాలు చేసినట్లు అనుమానాలు ఉన్నాయని, ఆమె భర్త భార్గవ్‌రామ్‌తో పాటు పరారీలో ఉన్న అనుచరులను అరెస్టు చేయాల్సి ఉందని కోర్టుకు నివేదించారు. బోయిన్‌పల్లి నుంచి కిడ్నాప్‌ చేసిన ప్రవీణ్‌రావు, నవీన్‌రావు, సునీల్‌రావులను నగర శివార్లలోని ఫామ్‌హౌస్‌లో బంధించిన నిందితులు వారి నుంచి కొన్ని పత్రాలపై సంతకాలు తీసుకున్నారని దర్యాప్తు అధికారులు న్యాయస్థానానికి వివరించారు. వాటిని స్వాధీనం చేసుకోవాలంటే అవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలని తెలిపారు. మిగిలిన నిందితులను అరెస్టు చేసిన తర్వాతే కీలక ఘట్టమైన క్రైమ్‌ సీన్‌ రీ–కన్‌స్ట్రక్షన్‌ను చేపట్టాల్సి ఉందని పోలీసులు తమ పిటిషన్‌న్‌లో పేర్కొన్నారు.

శనివారం నుంచి ఈ నెల 15 వరకు అఖిలప్రియను తమ కస్టడీకి ఇవ్వాలని కోరారు. బాధితుల నుంచి అందిన ఫిర్యాదును బట్టే ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్‌) జారీ చేస్తామని పోలీసులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కిడ్నాప్‌ కేసులో తొలుత అఖిలప్రియ ఏ–2గా ఉన్నారని, ప్రాథమిక విచారణలో లభించిన ఆధారాలను బట్టి ఆమే సూత్రధారిగా తేలిందని, అందుకే రిమాండ్‌ రిపోర్టులో అఖిలప్రియను ఏ–1గా చేర్చామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇదిలా ఉండగా.. అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్, కిడ్నాప్‌లో కీలకంగా వ్యవహరించిన వారి అనుచరుడు శ్రీనివాస్‌ చౌదరి అలియాస్‌ గుంటూరు శీను లొంగుబాటు ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసింది. భార్గవ్‌రామ్‌ సికింద్రాబాద్‌ కోర్టులో లొంగిపోవడానికి వస్తున్నాడంటూ శుక్రవారం ఉదయం ప్రచారం జరిగింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు కోర్టు పద్ద బందోబస్తు, నిఘా ముమ్మరం చేశారు. ఆ ప్రాంతంలో బారికేడ్లు ఏర్పాటు చేసిన అధికారులు ఓ దశలో కోర్టు తలుపులూ మూసివేశారు. ఈ పరిణామంతో పోలీసులకు, న్యాయవాదులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 

పొలిటికల్‌ గేమ్‌గా కనిపిస్తోంది: మౌనిక 
బంజారాహిల్స్‌(హైదరాబాద్‌): హఫీజ్‌పేటలోని భూ వివాదం తమ తండ్రి భూమా నాగిరెడ్డి బతికున్నప్పటి నుంచే ఉందని ఆయన కుమార్తె, అఖిలప్రియ సోదరి భూమా మౌనికరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే పొలిటికల్‌ గేమ్‌గా కనిపిస్తోందని, అఖిలప్రియ ఆరోగ్య పరిస్థితిపై తమకు ఆందోళన ఉందని పేర్కొన్నారు. అరెస్టు చేసినప్పుడు టెర్రరిస్టులను కూడా బాగా చూస్తారని, అఖిలప్రియ అంతకంటే ఎక్కువా? అని ప్రశ్నించారు. కిడ్నాప్‌ చేసినప్పుడు నిందితులు ప్రవీణ్‌రావును కొట్టారు.. తిట్టారు.. అని అంటున్న పోలీసులు ఆ ఆధారాలను కోర్టుకు ఎందుకు అందించలేదని అన్నారు. ‘జైలు నుంచి మా అక్క బతికి వస్తుందా? ఈ పరిస్థితుల్లో భార్గవ్‌రామ్‌ బయటకు వస్తే రక్షణ ఉంటుందా?’అని ప్రశ్నించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement