కాఫీ విత్‌ ఖతీక్‌! | Police Revealing Facts By Chain Snatcher Umesh | Sakshi
Sakshi News home page

కాఫీ విత్‌ ఖతీక్‌!

Published Fri, Apr 29 2022 8:57 AM | Last Updated on Fri, Apr 29 2022 11:55 AM

Police Revealing Facts By Chain Snatcher Umesh - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బాధితులు అంతా మధ్య, దిగువ మధ్య తరగతికి చెందిన వారు... ఒక్కో రూపాయి కూడగట్టుకుంటేనే తులం బంగారం చేకూరేది... స్నాచింగ్‌లో పోగొట్టుకున్నది సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్న మంగళసూత్రాలు... సీరియల్‌ స్నాచర్‌ ఉమేష్‌ ఖతీక్‌ను కస్టడీలోకి తీసుకున్న పేట్‌ బషీరాబాద్‌ పోలీసులకు ఇవే కనిపించాయి. కేవలం తమ ఠాణా పరిధిలోని బాధితులే కాకుండా మూడు కమిషనరేట్లకు చెందిన వారికీ న్యా యం చేయాలని భావించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఉమేష్‌ను చాకచక్యంగా విచారించారు. చివరకు ‘కాఫీ విత్‌ ఖతీక్‌’తో అసలు గుట్టు బయటపెట్టేలా చేశారు.  

మూడు నేరాలు పేట్‌ బషీరాబాద్‌లోనే... 
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండల్లో ఐదు స్నాచింగ్స్‌ సహా ఎనిమిది నేరాలు చేసిన సింగిల్‌... సీరియల్‌ స్నాచర్‌ ఉమేష్‌ ఖతీక్‌ను ఈ నెల రెండో వారంలో పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు పీటీ వారెంట్‌పై తీసుకువచ్చారు. ఎనిమిదింటిలో మూడు నేరాలు ఈ ఠాణా పరిధిలోనివే కావడంతో ఈ అధికారులే ముందడుగు వేశారు. విచార ణ నిమిత్తం కస్టడీలోకి తీసుకోవడానికి అనుమతి కోరు తూ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. వారం రోజుల పాటు కోర్టు అనుమతించడంతో ఈ నెల 20న కస్టడీలోకి తీసుకుని తమ పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లారు.  

అతడి ఆరోగ్యం, గత చరిత్ర నేపథ్యంలో... 
ఉమేష్‌కు కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి. దీనికి తోడు గతంలో పోలీసు కస్టడీ నుంచి పారిపోయిన చరిత్ర కూడా ఉంది. పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు ప్రాథమికంగా ఈ రెండు అంశాలు దృష్టిలో పెట్టుకున్నారు. కస్టడీలోకి వచ్చిన తొలి రోజు ఉమేష్‌ పారిపోవడానికి ప్రయత్నాలు చేశాడు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న అధికారులు మరో రెండు రోజుల పాటు సాధారణంగా ప్రశ్నించారు. ఏమాత్రం తొణకని, బెణకని అతగాడు అహ్మదాబాద్‌ పోలీసులకు చెప్పినట్టే ‘తెంచినవన్నీ పడిపోయాయి’ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో అధికారులు తమ శైలి మార్చాలని భావించారు. 

లాకప్‌లో కూర్చుని కాఫీ తాగుతూ... 
నేరాలు చేయడంతో ఆరి తేరిన, ఇప్పటికే అనేకసార్లు అరెస్టు అయిన, ఓ సందర్భంలో గురజాత్‌ పోలీసుల పైనే ఆరోపణలు చేసిన ఉమేష్‌ ఖతీక్‌ను రోటీన్‌కు భిన్నంగా ‘బ్రేక్‌’ చేయించాలని పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు నిర్ణయించారు. ఓ నేరగాడి నుంచి నిజాలు రాబట్టడాన్ని పోలీసు పరిభాషలో బ్రేక్‌ చేయడం అంటారు. దీంతో ఒక రోజు అతడితో ప్రేమ పూర్వకంగా మెలిగిన అధికారులు ఎలాంటి హాని ఉండదనే నమ్మకం కలిగించారు. ఆపై అతడితో కలిసి లాకప్‌ గదిలోనే కూర్చుని కాఫీ కూడా తాగారు. ఈ పరిణామంతో ఉమేష్‌ వ్యవహారశైలిలో మార్పు రావడాన్ని అధికారులు గుర్తించారు.  

ఐదో రోజు నోరు విప్పాడు... 
పేట్‌ బషీరాబాద్‌ పోలీసుల తీరుతో ‘మంత్రముగ్ధుడైన’ ఉమేష్‌ ఖతీక్‌ ఐదో రోజు కస్టడీలో నోరు విప్పాడు. ఇక్కడ కొట్టేసిన బంగారం తన ఇంట్లోనే దాచానంటూ బయటపెట్టాడు. ఈ విషయం అహ్మదాబాద్‌ పోలీసులకు చెబితే అక్కడి కేసుల్లో రికవరీ చూపించేస్తారని, జైలు నుంచి వచ్చాక తనకు ఏమీ మిగలదనీ తప్పుడు వాంగ్మూలం ఇచ్చినట్లు బయటపెట్టాడు.

సాధారణంగా స్నాచింగ్‌ చేసిన బంగారం వెంటనే అమ్మేసి సొమ్ము చేసుకుంటానని, అలాంటప్పుడు బయటపెట్టినా రిసీవర్ల నుంచి రివకరీ చేస్తారు కాబట్టి తనకు ఎలాంటి నష్టం ఉండదని అన్నాడు. ఈ బంగారం అమ్మని కారణంగానే అలా చెప్పానని వివరించాడు. ఇలా అసలు విషయం తెలిసి అహ్మదాబాద్‌ వెళ్లిన పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు అతడి ఇంటి నుంచి 19 తులాలు రికవరీ చేసుకువచ్చారు.  

(చదవండి: ఆన్‌లైన్‌ గేమ్స్‌ వద్దన్నందుకు డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement