పట్టుబడిన మద్యాన్ని ప్రదర్శిస్తున్న ఎస్‌ఈబీ బృందం
ఎంవీపీకాలనీ(విశాఖ తూర్పు): నగరంలో పొరుగు రాష్ట్రాల మద్యం వరదలా పారుతోంది. దీని కోసం వ్యాపారుల ఏకంగా కొరియర్ సెంటర్‌ను కేంద్రంగా చేసుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. తెలంగాణ నుంచి కొరియర్ ద్వారా గాజుకవాక తెప్పించి అక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్టు ఎఈబీ అధికారులు తేల్చారు.
ఇదీ పరిస్థితి
మద్య నియంత్రణలో భాగంగా రాష్ట్రప్రభుత్వం 33 శాతం మద్యం దుకాణాలను మూసి వేయడంతో పాటు ధరలు పెంచడంతో కొందరు సరిహద్దు ప్రాంతాల నుంచి మద్యం దిగుమతి చేస్తున్నారు. దొడ్డి దారిన విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అయితే ఎస్‌ఈబీ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి అక్రమ వ్యాపారులకు చెక్ పడుతున్నారు. నగరంలో ఎస్‌ఈబీ (స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో) దాడుల్లో బుధవారం భారీగా పక్క రాష్ట్రాల మద్యం బాటిల్స్ పట్టుబడింది. ఎంవీపీ సర్కిల్–2 ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని ఎస్‌ఈబీ అధికారులు బుధవారం అక్రమ రవాణాపై నిఘా పెట్టగా పెద్ద ఎత్తున మద్యం సీసాలు పట్టుబడ్డాయి.
ఎస్‌ఐ మురళీ తెలిపిన వివరాలు .. ఎంవీపీ ఎస్‌ఈబీకి వచ్చిన విశ్వసనీయ సమాచారంతో మద్దిలపాలెం కూడలిలో సిబ్బంది మాటువేశారు. మధ్యాహ్నం మీసాల ఆదినారాయణ అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై వస్తుండగా పట్టుకున్నారు. అతని నుంచి ఒడిశాకు చెందిన 7 రాయల్‌స్టాగ్ సీసాలతో పాటో ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతన్ని స్టేషన్‌కు తరలించి విచారించగా తెలంగాణ నుంచి కూడా అక్రమంగా మద్యాన్ని దిగుమతి చేస్తున్నట్లు తెలిపాడు. గాజువాకలోని ఒక కొరియర్ సెంటర్‌కు తెలంగాణ నుంచి మద్యం సీసాలు వస్తున్నట్లు వెల్లడించాడు. దీంతో అతన్ని తీసుకొని గాజువాక వెళ్లిన పోలీసులు కొరియర్ సెంటర్‌కు అతని పేరు మీద వచ్చిన పార్సిల్‌ను తీసుకొని చూడగా అందులో 192 మద్యం సీసాలు బయటపడ్డాయి.
వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే నగరంలో వేర్వు వేర్వు ప్రాంతాలకు చెందిన మరో ఇద్దరు వ్యక్తులు ఇతనికి సహకరిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరంతా బృందంగా ఏర్పడి ఇతర రాష్ట్రాల నుంచి ట్రావెల్, కొరియర్ సర్వీసులతో పాటు పలు పద్ధతుల ద్వారా మద్యాన్ని దిగుమతి చేస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ మద్యం విక్రయాలపై నియంత్రణ ఉండటంతో అధిక ధరలకు విక్రయాలు చేస్తున్నట్లు వివరించారు. నగరంలో ఇలాంటి మరిన్ని గ్రూపులు మద్యం రవాణా, దిగుమతులు చేస్తున్నట్లు ఎస్‌ఐ మురళీ తెలిపారు. ఎస్‌ఈబీ ద్వారా అక్రమ రవాణాపై నిఘా పెట్టినట్లు వెల్లడించారు. ప్రస్తుత వ్యవహారంలో మిగతా ఇద్ధరి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. కేసు నమోదుతో పాటు దర్యాప్తుపై పూర్తిస్థాయిలో దృష్టిసారిస్తామన్నారు. ఈ దాడుల్లో ఎస్‌ఐ అప్పారావు, హెచ్‌సీ శ్రీధర్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment