
సాక్షి, మియాపూర్: ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తన తండ్రి చనిపోయాడని ఓ వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 15 రోజుల పాటు మదీనాగూడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందారని, రూ.10 లక్షల వరకు ఖర్చు చేసినట్లు చెప్పారు. తన తండ్రి కోలుకున్న తర్వాత ఆస్పత్రి నిర్లక్ష్యం కారణంగా మృతి చెందాడని కేపీహెచ్‌బీ కాలనీ ఫేజ్–3కి చెందిన ప్రమోద్ ఆరోపించారు. బాధితుడి వివరాల ప్రకారం.. బీహెచ్‌ఈఎల్‌లో ఉద్యోగం చేసే ప్రమోద్ తండ్రి శంకర్‌పవార్ 57) కరోనా సోకడంతో గతనెల 11న మదీనాగూడలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు.
ఈనెల 3వ తేదీన పూర్తిగా కోలుకున్నాడు. దీంతో అతడికి ఆక్సిజన్ అందిస్తున్నారు. ఈనెల 4వ తేదీన ప్రమోద్ బయటకు వెళ్లి వచ్చేసరికి తన తండ్రికి ఉన్న ఆక్సిజన్ మాస్క్ తొలగిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరు. వెంటనే సిబ్బందిని ప్రశ్నించగా వారు వచ్చి మాస్కు తొడిగేలోగా పల్స్ రేటు సున్నాకు పడిపోయింది. వెంటనే డాక్టర్లను పిలిచినా ఫలితం లేకుండా పోయిందని అన్నారు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తన తండ్రి మృతి చెందారని ప్రమోద్ మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment