అయ్యంకి(మొవ్వ): గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో జరిగిన జంట హత్యలు కృష్ణాజిల్లాలో కలకలం రేపాయి. ఆస్తి తగాదాలు, పాత కక్షలు భార్య భర్తలను బలితీసుకున్నాయి. మొవ్వ మండలం అయ్యంకి గ్రామంలో గురువారం చోటు చేసుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అయ్యంకి గ్రామానికి చెందిన వీరంకి చిన ఆంజనేయులుకు కుమారులు వీరంకి వీరకృష్ణ, వీరంకి పూర్ణచంద్రరావు, కుమార్తె అమ్ములు ఉన్నారు. ఆంజనేయులుకి గ్రామంలో 3.01 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమి వల్ల ఏర్పడిన వివాదాల కారణంగా 2008లో తండ్రి చినఆంజనేయులును, 2012లో తమ్ముడు పూర్ణచంద్రరావును వీరకృష్ణ హత్య చేశాడనే ఆరోపణలొచ్చాయి.
అయితే ఈ కేసుల్లో సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో కోర్టు కేసును కొట్టివేసింది. కాగా, పూర్ణచంద్రరావు హత్యానంతరం అతడి భార్య స్వర్ణ, ముగ్గురు కుమారులు గణేశ్, లోకేశ్, భువనేశ్ అయ్యంకి గ్రామం విడిచి వెళ్లిపోయారు. ఇటీవల స్వర్ణ తన పొలానికి పట్టాదారు పాసు పుస్తకానికి అప్లయ్ చేయగా లింక్ డాక్యుమెంట్స్ లేవంటూ వీఆర్‌వో, ఆర్‌ఐలు రిజక్ట్ చేశారు. దీనిపై వివరణ కోరేందుకు తాజాగా ఆమె తన కుమారులు ముగు్గరితో కలిసి గురువారం మధ్యాహ్నం అయ్యంకిలోని వీఆర్‌వో కార్యాలయానికి వచ్చింది.
ఈ సందర్భంగా పాస్‌పుస్తకాల విషయంలో స్వర్ణ కుటుంబానికి, అక్కడే ఉన్న వీరకృష్ణకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తులైన స్వర్ణ కుమారులు వెంట తెచ్చుకున్న కత్తులతో పెదనాన్న వీరకృష్ణను విచక్షణా రహితంగా నరికి హత్య చేశారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న అన్న సమారాధన కార్యక్రమం వద్ద ఉన్న వీరకృష్ణ భార్య వరలక్ష్మిని సైతం కత్తులతో పొడిచి హత్యచేసి పరారయ్యారు.
గుడివాడ డీఎస్పీ శ్రీకాంత్, పామర్రు సీఐ ఎన్.వెంకటనారాయణ, కూచిపూడి ఎస్‌ఐ డి.సందీప్ ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. వారు మీడియాతో మాట్లాడుతూ.. పక్కా ప్లాన్‌తోనే వీరకృష్ణ, వరలక్ష్మి దంపతుల హత్య జరిగినట్లు తెలిపారు. వీరకృష్ణ తమ్ముడి భార్య స్వర్ణ, ఆమె కొడుకులే హత్యలకు కారణమని వెల్లడించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. మృతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment