
అనపర్తి: అనపర్తి పోలీస్ స్టేషన్‌లో గతేడాది సెప్టెంబర్‌లో మిస్సయిన తుపాకీ బుధవారం బయటపడింది. రాయవరం మండలం వెదురుపాకకు చెందిన ఓ వ్యక్తి దీనిని అపహరించినట్లు పోలీసులు గుర్తించారు. సీఐ ఎన్‌వీ భాస్కరరావు బుధవారం ఈ విషయం విలేకర్లకు తెలిపారు. 2019 సాధారణ ఎన్నికల సందర్భంగా కర్రి దొరయ్యరెడ్డి అనే వ్యక్తి తన రెండు తుపాకులను పోలీస్‌స్టేషన్‌లో డిపాజిట్ చేశారు. వాటిని 2020లో అనపర్తి లాకప్‌లో భద్రపరిచారు. అందులో డీబీబీఎల్ తుపాకీ కనిపించలేదు.
ఈ సంఘటనలో అప్పటి ఎస్సై ఎండీఎంఆర్ ఆలీఖాన్, ఏఎస్సై గురవయ్య, కానిస్టేబుళ్లు అబ్దుల్ దురాని, జె.వరప్రసాద్‌లు సస్పెండయ్యారు. జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్ ఇటీవల దీనిపై దృష్టి పెట్టారు. లోతుగా ఆరా తీశారు. రాయవరం మండలం వెదురుపాకకు చెందిన సంగడాల శ్రీను, వెదరుపాక సావరానికి చెందిన వెలుగుపూడి లోవరాజుతో పాటు మరో మైనర్‌ను గతేడాది అక్టోబర్ 5న అనుమానాస్పదంగా తిరుగుతున్నారని పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. కరోనా సమయంలో తిరగవద్దని కౌన్సెలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. వీరిలో తుపాకీతో పిట్టలను వేటాడే సంగడాల శ్రీను లాకప్‌లో ఉన్న డీబీబీఎల్ తుపాకీని పోలీసుల కన్నుగప్పి తీసుకువెళ్లాడని తాజా విచారణలో తేలింది. తుపాకీ స్వా«దీనం చేసుకున్నారు. శ్రీనుతోపాటు మరో ముగ్గురిని బుధవారం అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు.