సాక్షి, అమరావతి బ్యూరో/పెనమలూరు: సరిగ్గా ఏడాది కిందట నగరంలో గ్యాంగ్‌వార్‌తో రెచ్చిపోయిన కొండూరి మణికంఠ అలియాస్ కేటీఎం పండు మరోసారి నగరంలో వీరంగం సృష్టించాడు. ఆదివారం కానూరు వంద అడుగుల రోడ్డులో పండు స్నేహితులతో మారణాయుధాలతో ప్రజల్ని భయాభ్రాంతులకు గురిచేస్తున్నాడన్న సమాచారంతో పెనమలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం పండుతో పాటు ఆరుగురు గ్యాంగ్ సభ్యుల్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుచారు. గత ఏడాది మే నెల 30వ తేదీన పటమట పప్పులమిల్లు సెంటర్ సమీప మైదానంలో రౌడీషీటర్ తోటా సందీప్, కేటీఎం పండు స్నేహితుల మధ్య గ్యాంగ్‌వార్ చోటుచేసుకుంది. ఇరువర్గాలు కత్తులు, రాడ్లు, బ్లేడ్లతో పరస్పరం దాడులకు పాల్పడ్డారు.
ఈ దాడుల్లో తోటా సందీప్ గాయపడి మే 31న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ కేసులో ఇరువర్గాలకు చెందిన 40 మందిపై పోలీసులు రౌడీషీటు తెరిచారు. సందీప్ మృతితో ప్రధాన నిందితుడు పండుతో పాటు మిగిలిన వారందరిపైనా ఐపీసీ 302, 307, 188, 269 సెక్షన్లతో కోవిడ్–19 చట్ట ప్రకారం కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి జైలులో ఉన్న పండు ఈ ఏడాది జనవరిలో షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలయ్యాడు. మూడు నెలలపాటు నగరంలో అడుగుపెట్టరాదని కోర్టు షరతు విధించడంతో పండు పామర్రులో మూడు నెలలు ఉన్నాడు.
అనంతరం చికిత్స నిమిత్తం తనకు నగరంలో ఉండేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టుకు విన్నవించడంతో సనత్‌నగర్‌లోని రామాలయం వీధిలో ఉంటున్నాడు. ఈ సమయంలోనే అక్రమ సంపాదనకు తెరతీశాడు. 20 రోజుల క్రితం పండు, అతడి అనుచరులు విశాఖపట్నం వెళ్లి గంజాయి తీసుకొచ్చారు. విజయవాడ శివారుతో పాటు నగరంలో వివిధ ప్రాంతాల్లో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నాడు.
స్నేహితుడిపై కత్తులతో దాడి వీడియోతో..
గత బుధవారం రౌడీషీటర్ మణికంఠ స్నేహితుడు కోనేరు రాజా పుట్టిన రోజు కావడంతో పండు తన స్నేహితులతో కలిసి వేడుకల్లో మద్యంతోపాటు గంజాయి తీసుకున్నారు. అనంతరం కోనేరు రాజాను పండుతోపాటు ఇతరులు కలసి కత్తులతో, కర్రలతో కొడుతున్నట్లు ఓ వీడియో చిత్రీకరించి ఫేస్‌బుక్‌లో అప్‌లౌడ్ చేశాడు. ఇది ప్రస్తుతం వైరల్ అయింది. గతంలోనూ పండు తనలోని క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూ అనేకసార్లు టిక్‌టాక్ వీడియోలతో హల్‌చల్ చేశాడు.
మారణాయుధాలతో సంచరిస్తూ...
ఆదివారం పండు తన స్నేహితులతో కలిసి మారణాయుధాలతో సంచరిస్తూ ఓ సెటిల్‌మెంట్‌కు ప్రయత్నిస్తున్న సమయంలో పెనమలూరు పోలీసులు పక్కా సమాచారంతో కానూరు వంద అడుగుల రోడ్డులో వారిని అదుపులోకి తీసుకున్నారు. సనత్‌నగర్‌కు చెందిన పండుతోపాటు కోనేరు రాజా, కవి ప్రవీణ్, తిరుమలశెట్టి నాగరాజు, సప్పా దర్గారావు, విజయవాడ ఫకీర్‌గూడెంకు చెందిన షేక్ గాలీబ్‌ల నుంచి రెండు పెద్ద కత్తులు, 8 చిన్నకత్తులు, 15 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వారిని సోమవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా కోర్టు వారికి రిమాండ్ విధించినట్లు సీఐ ఎం.సత్యనారాయణ తెలిపారు.
పండు నేర చరిత్ర ...
కేటీఎం పండు నేర చరిత్ర పెద్దదే. పండుపై విజయవాడ నగరంలో ఏడు కేసులు నమోదు అయ్యాయి. పటమట పీఎస్ పరిధిలో ఒక హత్య, ఒక హత్యాయత్నం కేసు, ఒక కొట్లాట కేసు, కృష్ణలంక పీఎస్‌లో ఒక కొట్లాట కేసు, పెనమలూరు పీఎస్ పరిధిలో రెండు కొట్లాట కేసులు, ఒక బైండోవర్ కేసు నమోదు అయ్యాయి. 2020లో అతనిపై రౌడీషీటు తెరిచారు.
Comments
Please login to add a commentAdd a comment