సిటీలో ఎర్రచందనం డంపులు? | Sandlewood Dumpings in Hyderabad | Sakshi
Sakshi News home page

సిటీలో ఎర్రచందనం డంపులు?

Published Tue, Aug 11 2020 7:54 AM | Last Updated on Tue, Aug 11 2020 7:54 AM

Sandlewood Dumpings in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: శేషాచలం అడవుల్లో మాత్రమేలభించే ఎర్రచందనం డంపులు హైదరాబాద్‌లోనూ ఉన్నాయా..? వ్యవస్థీకృత ముఠాలు ఈ సరుకును సిటీ మీదుగా ఢిల్లీకి తరలిస్తున్నాయా..? అక్కడ నుంచి భారీగా విదేశాలకు తరలి వెళ్లిపోతోందా..? అంటే..ఔననే అంటున్నారు ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు. గత నెల ఆఖరి వారంలో వారు అరెస్టు చేసిన భోలే రామ్‌ కాశ్యప్‌ విచారణలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంలో ఢిల్లీకి చెందిన ఓ ప్రత్యేక బృందం ఆదివారం నగరానికి వచ్చింది.

ఈ దందాలో నగరానికి చెందిన మరికొందరికీసంబంధం ఉందని ఢిల్లీ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారు అప్రమత్తం కాకుండా ఉండేందుకు తమ విచారణ వివరాలను అధికారులు అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. ఢిల్లీ శివార్లలోని మెండు గర్హి ప్రాంతంలో భారీ స్థాయిలో ఎర్రచందనం దుంగలు అక్రమంగా దాచి ఉంచినట్లు ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌కు గత నెల 30న సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఆ ప్రాంతంపై దాడి చేశారు. ఫలితంగా 1797.05 కేజీల బరువుతో ఉన్న రూ.50 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని, భోలే రామ్‌ కాశ్యప్‌ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఇతడి విచారణ నేపథ్యంలోనే ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీలోని సుభాష్‌ పార్క్‌ ప్రాంతానికి చెందిన మెండు గర్హి ప్రాంతంలో ఓ గోదాము అద్దెకు తీసుకున్నాడు. అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లింగ్‌ గ్యాంగ్‌లో ఇతడు కీలక పాత్ర పోషిస్తున్నాడు. బీహార్‌లోని పట్నా ప్రాంతానికి చెందిన మరో వ్యక్తి ఇతడికి సహకరిస్తున్నాడు.

అంతర్జాతీయ లావాదేవీలన్నీ అతడి పర్యవేక్షణలో జరుగుతున్నాయి. శేషాచలం అడవుల నుంచి స్మగ్లర్లు ఎర్రచందనం దుంగల్ని హైదరాబాద్‌తో పాటు ఉత్తరాదికి తరలిస్తున్నారు. ప్రధానంగా రాజస్థాన్‌లోని చిత్తోర్‌ఘడ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలకు ఈ దుంగలు చేరుతున్నాయి. ఇక్కడ నుంచి అంతర్జాతీయ మాఫియా రంగంలోకి దిగుతోంది. ఈ దుంగల్ని రకరకాలుగా మారుస్తున్న స్మగ్లర్లు విమానాల ద్వారా తక్కువ మోతాదులో, ఓడల్లో భారీ స్థాయిలో విదేశాలకు తరలించేస్తున్నారు. ప్రధానంగా చైనా, జపాన్‌లతో పాటు కొన్ని ఆసియా దేశాలకు అక్రమ రవాణా చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఎర్రచందనం ధర భారీగా ఉంటోంది. భోలేరామ్‌ కాశ్యప్‌ కేసును సీరియస్‌గా తీసుకున్న ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌ దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపింది. పరారీలో ఉన్న పట్నా వాసి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇతడు చిక్కితేనే అంతర్జాతీయ మాఫియా లింకులు వెలుగులోకి వస్తాయని ఢిల్లీ పోలీసులు చెప్తున్నారు. భోలే రామ్‌కు ఎర్రచందనం చిత్తోర్‌ఘడ్‌తో పాటు హైదరాబాద్‌ నుంచి వచ్చినట్లు తేలడంతో ఈ రెండు ప్రాంతాల్లో దర్యాప్తు చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ స్పెషల్‌ టీమ్‌ ఆదివారం హైదరాబాద్‌ చేరుకుని రహస్యంగా దర్యాప్తు చేస్తోంది. ఈ కేసుకు సంబ«ంధించి త్వరలోనే మరికొన్ని అరెస్టులు చోటు చేసుకునే అవకాశం ఉంది. 

చందనం సైతం అక్రమ రవాణా... 
హైదరాబాద్‌ కేంద్రంగా ఎర్రచందనమే కాదు... చందనం కూడా భారీ స్థాయిలో అక్రమ రవాణా అవుతోంది. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి దుబాయ్‌కు పార్శిల్‌ చేసిన గంధం చెక్కలను సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌) అధికారులు పట్టుకున్నారు. ఈ ఉదంతం గత నెల 30న చోటు చేసుకుంది. 78.5 కేజీల బరువు ఉన్న గంధపు చెక్కల్ని చిప్స్‌తో పాటు స్టిక్స్‌ రూపంలోకి మార్చిన స్మగ్లర్లు అక్రమ రవాణాకు ప్రయత్నించారు. ఈ కేసును శంషాబాద్‌ విమానాశ్రయం కస్టమ్స్‌ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement