సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో జరిగిన రెండు సామూహిక అత్యాచార కేసులను పోలీసులు చేధించారు. గాంధీ ఆసుపత్రి, సంతోష్ నగర్ కేసుల ఫిర్యాదులో వాస్తవం లేదని, అంతా ఫేక్ అని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో కూడా మహిళపై సామూహిక అత్యాచారం జరగలేదని వెల్లడించారు.
గాంధీ ఆస్పత్రిలో మహిళపై గ్యాంగ్ రేప్ జరగలేదని, అక్కా చెల్లెల్లిద్దరికీ కల్లు తాగే అలవాటు ఉందని పోలీసులు తెలిపారు. అక్క ఆస్పత్రి నుంచి వెళ్లిపోవడంతో చెల్లెలు అక్కడే ఉండిపోయిందన్నారు. కల్లు తాగి అపస్మారక స్థితిలో ఉన్న చెల్లి.. అక్క విషయాన్ని దాచిపెట్టేందుకు అత్యాచారం కథ అల్లినట్లు వెల్లడించారు.
ఇక సంతోష్ నగర్ కేసు పూర్తి అభూత కల్పన అని, తనపై ముగ్గురు ఆటో డ్రైవర్లు అత్యాచారం చేశారంటూ యువతి కట్టు కథ అల్లిందని పేర్కొన్నారు. ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో అతన్ని కేసులో ఇరికించేందుకు ప్లాన్ చేసినట్లు వెల్లడించారు.
అసలేం జరిగిందంటే.. దక్షిణ మండలంలోని సంతోష్‌నగర్ పోలీసులకు మరో సవాల్ ఎదురైంది. ఆటోలో ఎక్కిన తనకు మత్తుమందు ఇచ్చి ముగ్గురు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఓ బాధితురాలు బుధవారం ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా కేసు నమోదు చేసుకున్న సంతోష్‌నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మూడు రోజుల వ్యవధిలో నమోదైన రెండో కేసు కావడంతో నగర పోలీసు ఉన్నతాధికారులు ఉలిక్కిపడ్డారు. ఈ కేసును కొలిక్కి తీసుకురావడానికి డీసీపీ గజరావ్ భూపాల్ ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వివరాలు...
మత్తు మందు ప్రయోగించి..
పిసల్‌బండ ప్రాంతానికి చెందిన యువతి సంతోష్‌నగర్‌లో ఉన్న డయాగ్నస్టిక్ సెంటర్‌లో పని చేస్తోంది. ప్రతి రోజూ తన విధులు ముగిసిన తర్వాత అక్కడ నుంచి పిసల్‌బండకు ఆటోలో వెళుతూంటుంది. మంగళవారం రాత్రి 9 గంటలకు సంతోష్‌నగర్ వద్ద ఆటో ఎక్కింది. ఆ సమయంలో ఆటోలో ఆమెతో పాటు ఓ మహిళ, ఇద్దరు యువకులు ఉన్నారు. కొంత దూరం ప్రయాణించిన తర్వాత మహిళ దిగిపోగా.. డ్రైవర్‌తో పాటు ఇద్దరు యువకులు ఆటోలోనే ఉన్నారు. ఆ సమయంలో తనపై మత్తు మందు ప్రయోగించినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.
బుధవారం ఉదయం తనకు మెలకువ వచ్చే సమయానికి షాహిన్‌నగర్‌లోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో ఉన్నానని, తనపై ఆ ముగ్గురూ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారంటూ పోలీసులకు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సంతోష్‌నగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వైద్య పరీక్షల నిమిత్తం యువతిని భరోసా కేంద్రానికి తరలించారు. ఆయా ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి దర్యాప్తు చేయగా యువతి నాటకం బహిర్గతమైంది.
కిడ్నాప్, అత్యాచారం జరిగినట్లుగా ఎక్కడ కూడా ఆనవాళ్లు దొరకలేదు. ఆమె తన ప్రియుడిని కేసులో ఇరికించాలనే ఆలోచనతో ఇదంతా చేసిందని, హైడ్రామా ఆడిందని తేలింది. పోలీసుల విచారణలోనూ తాజాగా యువతి తన తప్పును ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. తన ప్రియుడితో వేరొకరితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న నేపథ్యంలో అతనిపై పగ సాధించేందుకు.. ఈ కేసులో ఇరికించాలని యువతి డ్రామ మొదలు పెట్టినట్టు సమాచారం. మరోవైపు యువతిపై లైంగిక దాడి జరగలేదని దర్యాప్తు అధికారులకు మెడికల్ రిపోర్ట్ కూడా అందినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment