ప్రతీకాత్మక చిత్రం
జైపూర్ : దళిత మహిళను వివస్త్రను చేసి, విచక్షణా రహితంగా ఆమెపై దాడి చేశారు ఇద్దరు. ఈ సంఘటన రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉదయ్‌పూర్, ఆలోద్ గ్రామానికి చెందిన సోసర్ బాయి అనే ఓ దళిత మహిళ కొద్దిరోజుల క్రితం అదే గ్రామానికి చెందిన చాందీ బాయితో గొడవపడింది. ఒకరినొకరు బూతులు తిట్టుకున్నారు. ఈ నేపథ్యంలో సోసర్‌పై కక్ష పెంచుకున్న చాందీ అవకాశం కోసం ఎదురుచూడసాగింది. ఈ నెల 28న సోసర్ ఇంటివద్ద బట్టలు ఉతుక్కుంటుండగా చాందీ బాయి ఆమె కుమారుడు కిషన్ తెలి బైక్‌పై అక్కడికి వచ్చారు. అనంతరం చాందీ, సోసర్ చేతుల్ని వెనక్కు విరిచి పట్టుకుంది. కిషన్.. సోసర్‌ను విచక్షణా రహితంగా కొట్టాడు. ఆ తర్వాత ఆమెను వివస్త్రను చేసి ఇద్దరూ సైకిల్ చైన్‌తో కొట్టారు. ( మత్తు ఇచ్చి పనిమనిషిపై అత్యాచారం.. ఆపై వీడియో తీసి..)
దీంతో బాధితురాలి వేళ్లు విరిగిపోయాయి. విపరీతంగా దెబ్బలు తగిలాయి. ఆమె సహాయం కోసం ఎంత అరిచినా జనం రాలేదు. దెబ్బలు తాళలేక స్పృహ కోల్పోయింది. నిందితులు అక్కడినుంచి వెళ్లిపోయారు. పొలంలో పని చేసుకుంటున్న సోసర్ బాయి భర్త విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. రక్తపు మడుగులో పడిఉన్న భార్యను హుటాహుటిన ఆస్పత్రికి తరలించాడు. ఆ రోజు సాయంత్రం దుగ్లా పోలీస్ స్టేషన్‌లో తల్లీ, కుమారుడిపై ఫిర్యాదు చేశాడు. సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
దీనిపై బాధితురాలి భర్త మాట్లాడుతూ.. ‘‘ చాందీ బాయి నా భార్యపై తప్పుడు ప్రచారం చేసింది. సోసర్ క్యారెక్టర్ మంచిది కానందు వల్లే తన కుమారుడితో నిశ్చితార్థం రద్దు చేసుకున్నానని అందరికీ చెబుతోంది. దీంతో లేడీ కానిస్టేబుల్స్ కూడా నా భార్యను తప్పుడు దానిలా చూశారు. వైద్య పరీక్షల నిమిత్తం వెళుతున్నపుడు ఎవరూ తోడు కూడా రాలేదు’’ అని వాపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment