
పరిగి/ మిడ్జిల్: సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడి ఇద్దరు యువకులు మృతి చెందారు. ఆదివారం వికారాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. వికారాబాద్ నగరంలోని సూరారం కాలనీకి చెందిన వీరరాజు(25) ఆదివారం ఉదయం అనంతగిరి అందాలను వీక్షించేందుకు ఎనిమిది మంది స్నేహితులతో కలిసి కారులో వచ్చారు. తిరుగు ప్రయాణంలో పరిగి సమీపంలో లక్నాపూర్ ప్రాజెక్టు అలుగు వద్దకు వెళ్లారు. అక్కడ స్నేహితులతో కలసి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు వీరరాజుతో పాటు మరో ఇద్దరు పడిపోయారు.
వీరరాజుకు ఈతరాకపోవడంతో నీటమునిగిపోయాడు. పక్కనే ఉన్న మత్స్యకారులు బయటకు తీయగా, స్నేహితులు పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొం దుతూ వీరరాజు మృతి చెందాడు. మరో ఘటన మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం అయ్యవారిపల్లి శివారులో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కుందేళ్ల శివప్రసాద్ (23) జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్‌లోని ఓ ఫార్మస్యూటికల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం సెలవు కావడంతో బాబాయి కూతుళ్లతో కలిసి సమీప దుందుబీవాగు పరిధిలోని చెక్‌డ్యాం వద్దకు వెళ్లాడు. అక్కడ సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు అందులో పడి నీట మునిగి మృతి చెందాడు. కాగా, శివప్రసాద్ తండ్రి కృష్ణయ్య మూడేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి యశోద ప్రస్తుతం కుమారుడిపైనే ఆధారపడి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment