హత్యకు పాల్పడిన నిందితులు
షాద్‌నగర్: బీమా డబ్బులు కాజేసేందుకు నలుగురు వ్యక్తులు డ్రామా ఆడారు. యువకుడిని హాకీ స్టిక్‌తో కొట్టి నడిరోడ్డుపై పడేసి కారుతో తొక్కించి దారుణంగా హత్య చేశారు. ఆపై రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. ఏడాది క్రితం జరిగిన ఈ కేసును పోలీసులు ఛేదించారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలోని మొగిలిగిద్ద శివారులో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి కేసును షాద్‌నగర్ పోలీసులు ఛేదించి నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ వివరాలను సోమవారం షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి వెల్లడించారు.
కంపెనీ ఏర్పాటు చేసి.. : వరంగల్ జిల్లా చెన్నారావు పేట మండలం బోడ తండాకు చెందిన బోడ శ్రీకాంత్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కొంతకాలంగా హైదరాబాద్ బాచుపల్లిలోని శ్రేష్ట రెసిడెన్సీలో నివాసం ఉంటున్నాడు. ఓ కంపెనీ ఏర్పాటు చేసి ఫేక్ ఉద్యోగాలు సృష్టించాడు. పని చేస్తామంటూ వచ్చిన వారి పేర్లపై క్రెడిట్‌కార్డులు తీసుకొని, వాటి ద్వారా డబ్బులు తీసుకుంటూ బ్యాంకులను మోసం చేస్తూ విలాసవంతమైన జీవితం సాగిస్తున్నాడు.
గుంటూరు జిల్లా నర్సంపేట మండలం గురజాల గ్రామానికి చెందిన భిక్షపతి అనే యువకుడు శ్రీకాంత్ వద్ద పని చేసేందుకు వచ్చాడు. అతడికి తల్లిదండ్రులు, తోబుట్టువులు లేరన్న విషయం తెలుసుకున్న శ్రీకాంత్.. అతడి పేరు మీద రూ.50లక్షల బీమా పాలసీ తీశాడు. పాలసీకి నామినీగా తన పేరు పెట్టుకున్నాడు. 2021లో ఐసీఐసీఐ బ్యాంకులో రూ.52 లక్షలు లోన్ తీసుకుని మేడిపల్లిలో ఓ ఇంటిని కొనుగోలు చేసి భిక్షపతి పేరున రిజిస్టర్ చేయించాడు.
తర్వాత డబ్బులు అవసరం ఉండటంతో శ్రీకాంత్ ఆ ఇంటిని అమ్మకానికి పెట్టగా, భిక్షపతి అంగీకరించలేదు. దీంతో ఎలాగైనా అతడిని అంతమొందించాలనుకున్న శ్రీకాంత్ తనకు పరిచయం ఉన్న అప్పట్లో మల్కాజిగిరిలో హెడ్‌కానిస్టేబుల్‌గా (ప్రస్తుతం సైబరాబాద్ సీసీఎస్‌లో..) పనిచేస్తున్న మోతీలాల్‌ను కలిశాడు. తనకు సాయం చేస్తే రూ.10లక్షలు ఇస్తానని చెప్పడంతో భిక్షపతిని హత్య చేసేందుకు హెడ్‌కానిస్టేబుల్ పథకాన్ని రచించాడు.
కారులో తీసుకెళ్లి హత్య : భిక్షపతిని హత్య చేసేందుకు శ్రీకాంత్ తన వద్ద పని చేస్తున్న మహబూబాబాద్ జిల్లా గూడురు మండలం రాముతండాకు చెందిన బానోతు సమ్మన్న, వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండలం జల్లి గ్రామానికి చెందిన చాగంటి సతీష్ సాయం తీసుకున్నాడు. సమ్మన్న, సతీష్ కు చెరో రూ.5లక్షల చొప్పున, హెడ్‌కానిస్టేబుల్‌కు రూ.10లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. 22 డిసెంబర్, 2021న నలుగురూ కలిసి భిక్షపతిని కారులో షాద్‌నగర్ పరిధిలోని మొగిలిగిద్దకి తీసుకొచ్చి మద్యం తాగించారు.
తర్వాత భిక్షపతి తలపై హాకీ స్టిక్‌తో బలంగా కొట్టి కింద పడేశారు. అతనిపై నుంచి రెండుసార్లు కారును నడిపించి హతమార్చారు. బీమా క్లెయిమ్ కోసం దరఖాస్తు వచ్చినప్పుడు ఆ కంపెనీ ప్రతినిధులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ దిశగా పోలీసులు దర్యాప్తుచేయడంతో అసలు విషయం వెలుగుచూసింది. çనలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఏసీపీ కుషాల్కర్ నేతృత్యంలోని సీఐ నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, రాంబాబు, కానిస్టేబుల్స్ కేసును చేధించారు.
Comments
Please login to add a commentAdd a comment