సాక్షి, ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన షీనా బోరా హత్యకేసులో కొత్త ట్విస్టు వెలుగులోకి వచ్చింది. తన కూతురు షీనా బతికే ఉందని ఈ హత్య కేసులో ఆరోపణలెదుర్కొంటున్న ఐఎన్‌ఎక్స్ మీడియా మాజీ వ్యవస్థాపకురాలు ఇంద్రాణి ముఖర్జీ సీబీఐని ఆశ్రయించడం సంచలనంగా మారింది. దీనిపై విచారణ జరిపించాలని ఇంద్రాణి డిమాండ్ చేయంటా హాట్ టాపిక్‌గా నిలిచింది.
తన కూతురు షీనా బోరా బతికే ఉందని ఇంద్రాణి సీబీఐ డైరెక్టర్‌కు ఒక లేఖ రాసింది. దీనిపై దర్యాప్తు చేయాలని ఆమె డిమాండ్ చేసింది. కశ్మీర్‌లో షీనా బోరాను కలిశానని ఇటీవల జైలులోని సహ ఖైదీ తనకు చెప్పిందని ఆమె తన లేఖలో పేర్కొంది. కశ్మీర్‌లో షీనా బోరా కోసం గాలింపు చేపట్టాలని ఆమె సీబీఐని కోరింది. దీంతో ఈ లేఖపై విచారణ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు ఇంద్రాణి తరఫు న్యాయవాది దీనిపై స్పందించారు. ఇంద్రాణి నేరుగా సీబీఐకి లేఖ రాశారని, ఈ లేఖలో ఆమె ఏమి ప్రస్తావించారో తనకు తెలియదని అన్నారు. దీనిపై సమాచారం సేకరిస్తానని చెప్పారు.
కాగా షీనా బోరా ఇంద్రాణి మొదటి భర్త కుమార్తె. ఇంద్రాణి ముఖర్జీ తన ఇద్దరు పిల్లలు షీనా, మిఖాయిల్‌లను గౌహతిలో వదిలి ముంబైకి వెళ్లి అక్కడ మీడియా బారన్ పీటర్ ముఖర్జీని వివాహం చేసుకుంది. ఇంద్రాణి షీనాను తన సోదరిగా పీటర్‌కు పరిచయం చేసింది. అనూహ్యంగా 2012లో షీనా అదృశ్యమైంది. దాదాపు మూడేళ్ల తరువాత కుమార్తె షీనా బోరాను హత్య చేసిన కేసులో నిందితురాలిగా ఇంద్రాణి ముఖర్జీని 2015లో అరెస్టు చేశారు. అప్పటి నుంచి ముంబైలోని బైకుల్లా జైలులో ఇంద్రాణి ఉంటున్నసంగతి తెలిసిందే.
ఈ కేసులో విచారణ చేపట్టిన సీబీఐ మూడు ఛార్జిషీట్లు, రెండు అనుబంధ ఛార్జిషీట్లు దాఖలు చేసింది. అలాగే ఇంద్రాణి, ఆమె డ్రైవర్ శ్యాంవర్ రాయ్, మాజీ భర్త సంజీవ్ ఖన్నా, ఇంద్రాణి మూడో భర్త పీటర్ ముఖర్జీను నిందితులుగా పేర్కొంది. డబ్బు, ఇల్లు కోసం షీనా తల్లిని బ్లాక్ మెయిల్ చేసేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. డ్రైవర్ తుపాకీ పట్టుబడటం, అతని వాంగ్మూలం ఆధారంగా ఇంద్రాణి షీనాను హత్య చేసిందని సీబీఐ ఆరోపించింది. అయితే విచారణ సమయంలో పీటర్, ఇంద్రాణి విడాకులు తీసుకోగా, పీటర్ కు 2020లో బెయిల్ లభించింది. ఈ కేసులో గత నెలలో ఇంద్రాణి ముఖర్జీ బెయిల్ పిటిషన్‌ను బాంబే హైకోర్టు తిరస్కరించింది. అయితే, దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment