చదివింది మూడు.. నకిలీ కంపెనీని సృష్టించి | SIT Reveals Perfect Company Fake Sanitizer Manufacturing | Sakshi
Sakshi News home page

‘పర్‌ఫెక్ట్‌’గా ముగించారు

Published Sat, Aug 8 2020 7:30 AM | Last Updated on Sat, Aug 8 2020 7:30 AM

SIT Reveals Perfect Company Fake Sanitizer Manufacturing - Sakshi

చదివింది మూడో తరగతే. కాని ప్రముఖ ఫార్మా కంపెనీ పేరుతో శానిటైజర్‌ తయారీ కేంద్రం నడుపుతున్నాడు.. కుమార్తె పేరుతో ఉన్న కాన్పూర్‌లోని ఓ ఫార్మా కంపెనీ పేరుతో లేబుల్స్‌ తయారుచేసి కంపెనీ బాటిళ్ల మాదిరిగా అలంకారం చేశాడు. హైదరాబాద్‌లో పలువురు డి్రస్టిబ్యూటర్లు, మెడికల్‌ షాపుల ద్వారా శానిటైజర్‌ అమ్మకాలు జరిపాడు. సరైన మిషనరీ గాని, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఉద్యోగులు గాని శానిటైజర్‌ తయారీకి సంబంధించిన ఫార్ములా గాని ఏమీ లేకుండానే ఇష్టం వచ్చిన కెమికల్స్‌ కలిపేసి శానిటైజర్‌ను తయారు చేసి అమ్మకాలు జరిపాడు. అందులో ప్రమాదకరమైన మిౖథెలిన్‌ క్లోరైడ్‌ (డీసీఎం) ను కలపడంతో అది తాగి ప్రకాశం జిల్లా కురిచేడులో ఏకంగా 16 మంది మృత్యువాత పడిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. అది తాగడానికి తయారు చేసినది కాకపోయినా అందులో ప్రమాదకరమైన కెమికల్స్‌ కలపడం వల్ల సదరు పర్‌ఫెక్ట్‌ కంపెనీ యజమాని శ్రీనివాస్‌ 16 కుటుంబాలు చిన్నాభిన్నం కావడానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కారకుడయ్యాడు. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన సిట్‌ బృందం వారం రోజుల్లోనే మూలాలతో సహా పెకిలించి వేసింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే ... 

సాక్షి, ఒంగోలు: మద్యం దొరక్క శానిటైజర్‌ తాగి కురిచేడులో 16 మంది మృత్యువాత పడిన ఘటనకు సంబంధించి సిట్‌ బృందం విచారణ కొలిక్కి వచ్చింది. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఉన్న పర్‌ఫెక్ట్‌ తయారీ కేంద్రాన్ని మూడు రోజుల క్రితమే సిట్‌ అధికారులు కనుగొన్న విషయం తెలిసిందే. తయారీ కేంద్రంలో పని చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు పరారీలో ఉన్న కీలక సూత్రధారి, కంపెనీ యజమాని శ్రీనివాస్‌ను విజయవాడ పరిసర ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. హైదరాబాద్‌కు వెళ్లిన మరో బృందం అక్కడ ఈ బాటిళ్లను సరఫరా చేస్తున్న డి్రస్టిబ్యూటర్‌తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని ఒంగోలుకు తరలించే ప్రయత్నంలో ఉన్నారు. ముందుగా శానిటైజర్‌ బాటిళ్లు, తయారీ సామగ్రిని సీజ్‌చేసి ఒంగోలుకు తరలించే పనిలో సిట్‌ అధికారులు నిమగ్నమయ్యారు.
 
మూడో తరగతి చదివి.. నకిలీ కంపెనీని సృష్టించి.. 
పర్‌ఫెక్ట్‌ కంపెనీ పేరుతో శానిటైజర్‌ తయారు చేస్తున్న శ్రీనివాస్‌ గతాన్ని పరిశీలిస్తే మొదట్లో ఓ పెట్రోల్‌ బంకులో చిన్న ఉద్యోగిగా పనిచేస్తూ కార్‌ పాలిషింగ్‌‌ లిక్విడ్‌ తయారు చేసే వారితో కలిసి వ్యాపారం మొదలు పెట్టాడు. ఆ తరువాత కరోనా విజృంభణతో వ్యాపారం మూలన పడటంతో ప్రత్యామ్నాయ మార్గాలు వెతికే పనిలో పడ్డాడు. గతంలో పరిచయం ఉన్న మార్కెటింగ్‌ వ్యక్తులు ఇచ్చిన సలహా మేరకు శానిటైజర్‌ తయారు చేసేందుకు సమాయత్తమయ్యాడు. మొదట్లో ఇంట్లోనే తయారు చేసి చిన్న ప్లాస్టిక్‌ బాటిల్లో నింపి అమ్మేందుకు ప్రయత్నించాడు.


పర్‌ఫెక్ట్‌ కంపెనీ శానిటైజర్‌ బాటిళ్లు

అయితే అవి అమ్ముడుపోక పోవడంతో కాన్పూర్‌లో ఉండే వందన ఫార్మా పేరుతో లేబుళ్లు తయారుచేసి ప్లాస్టిక్‌ బాటిళ్లను అలంకరించి అమ్మడం మొదలుపెట్టాడు. తన కూతురు పేరు వందన కావడంతో ఆ ఫార్మా కంపెనీని ఎంచుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. మొదట్లో హైదరాబాద్‌లో మాత్రమే ఈ బాటిళ్లను అమ్మాడు. అయితే కొందరు డి్రస్టిబ్యూటర్స్‌ ద్వారా దర్శి, కురిచేడు ప్రాంతాల్లో మెడికల్‌ షాపులకు సరఫరా కావడం వాటిని తాగి 16 మంది మృత్యువాత పడిన ఘటన తెలుసుకుని పరారయ్యాడు. శుక్రవారం విజయవాడ పరిసర ప్రాంతాల్లో సిట్‌ అధికారుల చేతికి చిక్కాడు.  

దొరకకుండా దాచేశారు... 
హైదరాబాద్‌లోని డి్రస్టిబ్యూటర్‌ వద్ద నుంచి తక్కువ ధరకు పర్‌ఫెక్ట్‌ శానిటైజర్‌ బాటిళ్లను దిగుమతి చేసుకున్న దర్శి, కురిచేడులోని కొందరు మెడికల్‌ షాపు యజమానులు వాటిని తాగి వరుసగా మరణాలు సంభవించడంతో భయాందోళనకు గురై స్టాకును దాచేశారు. పోలీసులు పదే పదే విచారించినా అమ్మిందెవరో బయట పెట్టలేదు. పర్‌ఫెక్ట్‌ కంపెనీ యజమానితో శ్రీనివాస్‌తో పాటు డిస్ట్రిబ్యూటర్‌ సైతం సిట్‌ అధికారుల చేతికి చిక్కాడని తెలుసుకున్న మెడికల్‌ షాపు నిర్వాహకులకు కంటిపై కునుకు లేకుండా పోయింది. తమ గుట్టు రట్టు కాక తప్పదని భావించిన కొందరు అజ్ఞాతంలోకి వెళ్లేందుకు ప్రయతి్నస్తున్నట్లు సమాచారం.  

అన్ని కోణాల్లో దర్యాప్తు.. 
పర్‌ఫెక్ట్‌ కంపెనీకి సంబంధించిన మూలాలతో సహా సిట్‌ అధికారులు కనిపెట్టినప్పటికీ జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ మరిన్ని కోణాల్లో దర్యాప్తు జరిపేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలిసింది. పర్‌ఫెక్ట్‌ కంపెనీ మాదిరిగా నకిలీ కంపెనీలు సృష్టించి శానిటైజర్లు అమ్మే ఫ్యాక్టరీలు, తయారీ కేంద్రాలపై పూర్తిస్థాయిలో సమాచారం సేకరించే పనిలో పడ్డారు. అంతే కాకుండా దర్శి, కురిచేడులలో పర్‌ఫెక్ట్‌ కంపెనీ శానిటైజర్లు అమ్మిన మెడికల్‌ షాపు నిర్వాహకులను గుర్తించి వారిలో కేసులో ఎంతవరకు బాధ్యులను చేయాలనే దానిపై న్యాయ సలహాలు తీసుకుంటున్నట్లు సమాచారం.  

శభాష్‌ సిట్‌.. 
కురిచేడులో శానిటైజర్‌ తాగి 16 మంది మృత్యువాత పడిన ఘటనపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ సిద్దార్థ్‌ కౌశల్‌ సీరియస్‌గా దృష్టి సారించారు. హుటాహుటిన మార్కాపురం ఓఎస్డీ కె.చౌడేశ్వరి నేతృత్వంలో దర్శి, మార్కాపురం డీఎస్పీలు కె. ప్రకాశరావు, నాగేశ్వరరెడ్డిలతో పాటు దర్శి, పొదిలి, అద్దంకి సీఐలు మొయిన్, శ్రీరాం, ఆంజనేయరెడ్డిలతో సిట్‌ను ఏర్పాటు చేశారు. ఎస్‌ఐబీ నుంచి మరో సీఐ వీరేంద్రబాబు, కురిచేడు ఎస్‌ఐ రామిరెడ్డిలు కూడా దర్యాప్తులో కీలకంగా వ్యవహరించారు. తమకు బాధ్యతలు అప్పగించిన వారం రోజుల్లోనే పక్క రాష్ట్రం తెలంగాణలో ఉన్న పర్‌ఫెక్ట్‌ కంపెనీ తయారీ కేంద్రం గుట్టురట్టు చేసి జనంలో ఉన్న అనుమానాలకు తెరదించారు. జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ సిట్‌ అధికారులతో నిరంతరం వారికి సూచనలిస్తూ కేసును ఛేదించారు. దీంతో శభాష్‌ సిట్‌ అంటూ ప్రకాశం జిల్లా ప్రజలతో పాటు డీజీపీ ప్రశంసలు పొందగలిగారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement