
సాక్షిప్రతినిధి,సంగారెడ్డి/ జోగిపేట /రాంచంద్రాపురం: టీసీఎస్‌లో ఉద్యోగం.. నెలకు రూ.80 వేలకుపైగా వేతనం.. ముద్దులొలికే ఇద్దరు చిన్నారులు.. అందమైన కుటుంబం.. కానీ ఆర్థిక ఇబ్బందులు ఆ కుటుంబాన్ని మింగేశాయి. అప్పులు తీర్చలేమోనన్న మనస్తాపంతో భర్త ఉరివేసుకోగా.. ఆ విషయం తెలిసిన భార్య పిల్లలతో సహా చెరువులో దూకింది. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో గురువారం ఈ ఘటన జరిగింది.
అసలేం జరిగింది?
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం గార్లపల్లికి చెందిన నాగేశ్వరరావు కుమారుడు బాయికాడోల్ల చంద్రకాంత్‌రావు. ఆయనకు కామారెడ్డి జిల్లా చిట్యాలకు చెందిన రిటైర్డ్ ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ కుమార్తె లావణ్యతో వివాహం జరిగింది. వారికి కుమారుడు ప్రీతమ్ (10), కుమార్తె సర్వజ్ఞ (2) ఉన్నారు. చంద్రకాంత్ తండ్రి నాగేశ్వర్‌రావు బీహెచ్‌ఈఎల్ ఉద్యోగి కావడంతో.. కుటుంబమంతా హైదరాబాద్‌లోనే స్థిరపడ్డారు. ప్రస్తుతం ఎంఐజీ విద్యుత్‌నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. చంద్రకాంత్ కొంతకాలంగా ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నాడు.
తన అప్పులు తీర్చేందుకు సొంతూరు గార్లపల్లిలో ఉన్న భూమినిగానీ, ప్రస్తుతం ఉంటున్న ఇంటినిగానీ అమ్మి డబ్బులు ఇవ్వాలని తల్లిదండ్రులను అడిగారు. ఇందుకు తండ్రి నాగేశ్వర్‌రావు అంగీకరించలేదు. ఈ క్రమంలో తండ్రీకొడుకు మధ్య మాటామాటా పెరిగినట్టు సమాచారం. ఈ విషయంగా కొంతకాలంగా ఇంట్లో గొడవలు జరుగుతున్నట్టు కుటుంబ సభ్యులు చెప్తున్నారు.
ఇంట్లో మళ్లీ గొడవ జరగడంతో..
గురువారం చంద్రకాంత్ భార్య లావణ్య తన ఇద్దరు పిల్లలను తీసుకుని బీరంగూడలోని తమ బంధువుల గృహప్రవేశానికి వెళ్లింది. సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో తిరిగి తమ ఇంటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత విద్యుత్‌నగర్‌లో ఇల్లు అమ్మకం, అప్పుల విషయంగా తండ్రీకొడుకుల గొడవ జరిగిందని.. లావణ్య పిల్లలను తీసుకుని ఇంట్లోంచి వెళ్లిపోయిందని తెలిసింది.
కాసేపటికి చంద్రకాంత్ ఇంట్లోనే ఉరివేసుకున్నాడు. ఇంట్లోంచి వెళ్లిపోయిన లావణ్య ఇద్దరు పిల్లలతో కలిసి ఆందోల్ చెరువులో దుకింది. శుక్రవారం ఉదయం వారి మృతదేహాలు చెరువులో పైకి తేలాయి.
చనిపోవాలని నిర్ణయించుకునే..
విద్యుత్‌నగర్‌లో గొడవ జరిగాక లావణ్య తన సెల్‌ఫోన్‌ను ఇంట్లోనే వదిలేసి.. పిల్లలను తీసుకుని బయటికి వచ్చేసిందని ఆమె సోదరి సౌజన్య తెలిపారు. కొంతసేపటి తర్వాత ముత్తంగి ప్రాంతం నుంచి వేరేవారి ఫోన్‌తో విద్యుత్‌నగర్‌లోని పక్కింటి వారికి ఫోన్ చేసిందని.. ‘మా ఆయన బాగానే ఉన్నాడా’అని అడిగిందని చెప్పారు. గొడవ జరిగాక ‘ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం బయట పడలేం, చావే శరణ్యం, నేను ఇక్కడే చనిపోతా.
నువ్వు ఎక్కడికైనా వెళ్లిపో..’అని భర్త చెప్పి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. చంద్రకాంత్ ఉరివేసుకున్నాడని పక్కింటివారు చెప్పడంతో.. తాను పిల్లలతో సహా చెరువులో దూకి ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఆందోలు–జోగిపేట వైపు బంధువులు, పరిచయస్తులు ఎవరూ లేకున్నా.. లావణ్య అటువైపు ఎందుకు వెళ్లిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అప్పులు ఎందుకయ్యాయి?
చంద్రకాంత్‌రావు ఇటీవల లింగంపల్లి ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్ కొనుక్కున్నారు. దానికోసం అప్పులు అయ్యాయా? షేర్లు, ఆన్‌లైన్ పెట్టుబడులు ఏమైనా పెట్టి నష్టపోయాడా అన్నది తేలాల్సి ఉందని అంటున్నారు. లావణ్య కుటుంబ సభ్యులు మాత్రం.. ఇంటి కోసమే చంద్రకాంత్ అప్పులు చేశాడని చెప్తున్నారు. క్రెడిట్ కార్డులపైనా లోన్లు తీసుకున్నాడని అంటున్నారు.
చదవండి: హైదరాబాద్ అమ్మాయితో ప్రేమ.. కొద్ది రోజులుగా ఆమె మాట్లాడటం లేదని..
Comments
Please login to add a commentAdd a comment