మృతురాలు సుజాతమ్మ (ఫైల్)
కంబదూరు: నవమాసాలు మోసి.. జన్మనిచ్చి.. కంటికి రెప్పలా కాపాడి.. పెంచి పెద్ద చేసిన కన్నతల్లినే ఓ కుమారుడు పెట్రోల్ పోసి సజీవదహనం చేశాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా కంబదూరులో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కంబదూరులోని ఓబయ్య కాలనీకి చెందిన ఈడిగ గోపీనాథ్, సుజాతమ్మ(59) దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
కుమార్తెలు ఇద్దరికీ పెళ్లిళ్లు కావడంతోపాటు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇంటర్ చదివిన కుమారుడు ప్రణీత్ హైదరాబాదులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. తాగుడుకు బానిసైన అతను ఉద్యోగం మానేసి స్వగ్రామం చేరుకున్నాడు. రోజూ మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వాలని తల్లిదండ్రులను హింసించేవాడు. సోమవారం కూడా మద్యం తాగడానికి డబ్బు ఇవ్వాలని అనారోగ్యంతో మంచంలో పడుకుని ఉన్న తల్లి సుజాతమ్మను అడిగాడు.
ఆమె డబ్బులు ఇవ్వకపోవడంతో ఆగ్రహంతో తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. చుట్టుపక్కలవారు మంటలను గమనించి సుజాతమ్మ భర్త గోపీనాథ్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన వచ్చేలోపే పూర్తిగా కాలిపోయిన సుజాతమ్మ మృతి చెందింది. ఘటనాస్థలాన్ని కళ్యాణదుర్గం డీఎస్పీ బి.శ్రీనివాసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి నిందితుడు ప్రణీత్‌ను అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment