భర్త శ్రీకాంత్‌తో భువనేశ్వరి (ఫైల్)
తిరుపతి క్రైం: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కిరాతకంగా హత్య చేసి.. సూట్ కేసులో ప్యాక్ చేసి.. తిరుపతి రుయా ఆస్పత్రి వెనుక దహనం చేసిన ఓ భర్త దుర్మార్గమిది. బంధువులకు అనుమానం రాకుండా ఉండేందుకు తన భార్యకు కరోనా వచ్చిందని.. ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని.. ఆ తర్వాత డెల్టా వేరియంట్‌తో మృతి చెందిందంటూ కట్టుకథలు చెప్పాడు. కరోనాతో మరణించడం వల్ల మృతదేహం కూడా ఇవ్వలేదని వాపోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు కూడా నిజమని నమ్మారు. అయితే డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా పోలీసులు ఈ కేసును ఛేదించారు. తిరుపతి అర్బన్ పోలీసులు చెప్పిన వివరాల మేరకు.. వైఎస్సార్ జిల్లా బద్వేల్‌కు చెందిన శ్రీకాంత్‌రెడ్డి.. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం రామసముద్రానికి చెందిన భువనేశ్వరి (27)ని రెండున్నరేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఒక ప్రముఖ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో వర్క్‌ఫ్రమ్ హోం చేస్తూ తిరుపతిలోని ఓ అపార్టుమెంట్‌లో భర్తతో కలిసి నివసిస్తోంది. శ్రీకాంత్‌రెడ్డి ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉంటూ నిత్యం భార్యతో గొడవపడేవాడు. దీంతో ఆమె తెలిసినవారి దగ్గర రూ.10 లక్షలు తెచ్చి అతడికి ఇచ్చింది. ఈ అప్పు తీర్చాలని ఇటీవల అడుగుతుండటంతో ఆమెను హత్య చేశాడని తెలుస్తోంది.
పక్కా ప్రణాళికతో..
ఈ నెల 23న తిరుపతి రుయా ఆస్పత్రి వెనుక పోలీసులకు కాలిన మృతదేహం లభించింది. దీంతో సెల్‌ఫోన్ కాల్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతురాలిని భువనేశ్వరిగా గుర్తించారు. సీసీ కెమెరాల పుటేజ్ ఆధారంగా రుయా ఆస్పత్రికి వచ్చిన ఓ డ్రైవర్‌ను అలిపిరి పోలీసులు గుర్తించి విచారించారు. డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో నిందితుడు శ్రీకాంత్‌రెడ్డి అని పోలీసులు నిర్ధారించారు. వెబ్‌సైట్‌లో శ్రీకాంత్‌రెడ్డి కారును బుక్ చేసుకున్నాడని డ్రైవర్ తెలిపాడు. ఓ పెద్ద సూట్‌కేసును తెచ్చి తన భార్య రుయా ఆస్పత్రిలో పెద్ద డాక్టర్ అని, ప్రస్తుతం తనకు కరోనా సోకిందని తెలిపాడు. సూట్‌కేసులో వెంటిలేటర్ ఉందని డ్రైవర్‌ను నమ్మించాడు. అనంతరం ఆస్పత్రి వెనుక ముళ్ల పొదల వద్ద డ్రైవర్‌కు అనుమానం రాకుండా కారును ఆపమని చెప్పి సూట్ కేసును అక్కడ దించాడు. డ్రైవర్ ప్రశ్నించడంతో మేడమ్‌కు కరోనా వచ్చిందని.. ఇక్కడ పెట్టి వెళ్తే ఈ వెంటిలేటర్‌ను ఆమె తీసుకుంటుందని చెప్పాడు. దీంతో శ్రీకాంత్‌రెడ్డి ఇంట్లో భార్యని హత్య చేసి.. సూట్ కేసులో ప్యాక్ చేసి.. కారులో మృతదేహాన్ని తెచ్చి రుయా ఆస్పత్రి వెనుక తగులబెట్టినట్లుగా పోలీసులు నిర్ధారించారు. నిందితుడు సూట్ కేసుని కారులో ఎక్కిస్తున్న దృశ్యాలు అపార్ట్‌మెంట్ సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.
డెల్టా వేరియంట్‌తో మరణించిందని..
బంధువుల వద్ద శ్రీకాంత్‌రెడ్డి ఆడిన డ్రామా కూడా వెలుగులోకి వచ్చింది. తన భార్యకు కరోనా డెల్టా వేరియంట్ వచ్చిందని.. రుయా ఆస్పత్రిలో చేర్చానని కుటుంబ సభ్యులను, బంధువులను శ్రీకాంత్ నమ్మించాడు. అనంతరం భువనేశ్వరి మరణించిందని.. కరోనాతో మృతి చెందడం వల్ల మృతదేహాన్ని ఇవ్వడం లేదని కట్టుకథ చెప్పాడు. అంతేకాకుండా బంధువులను రుయా ఆస్పత్రిలోని మార్చురీకి తీసుకెళ్లి మృతదేహాలన్నింటినీ వెదికినట్టు నటించాడు. కాగా, నిందితుడు శ్రీకాంత్‌రెడ్డి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. రెండు బృందాలు తెలంగాణలోని హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో ఆరా తీస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment