తుమకూరు: ఆంగ్లం చదవలేక 7వ తరగతి విద్యార్థి ఆత్మహత్యకు యత్నించాడు. తుమకూరు తాలూకా ఉర్గిగెరె గ్రామానికి చెందిన అజయ్(12) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదవుతున్నాడు. ఆంగ్లం కష్టంగా ఉందని, పాఠశాలకు వెళ్లేది లేదని భీష్మించుకుని కూర్చున్నాడు. అయితే తల్లిదండ్రులు ఒత్తిడి తెచ్చి పాఠశాలకు పంపుతున్నారు. దిక్కుతోచని స్థితిలో బాలుడు ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించగా ప్రాణాపాయం తప్పింది.
విద్యార్థినిని చిదిమేసిన స్కూల్ బస్
బనశంకరి: ద్విచక్రవాహనాన్ని స్కూల్‌బస్ ఢీకొని విద్యార్థిని మృతిచెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. ఈఘటన బనశంకరి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. నాయండహళ్లి నివాసి కీర్తన(16) తన అక్క హర్షితతో కలిసి కనకపుర వద్ద ఉన్న హారోహళ్లికి వెళ్లారు. గురువారం ఉదయం నాయండహళ్లికి వెళ్లేందుకు దేవెగౌడ పెట్రోల్ బంక్‌వద్దకు చేరుకున్నారు. అప్పటికే ఆలస్యమైందని భావించి స్నేహితుడు దర్శన్‌తో కలిసి బైక్‌పై ఇంటికి బయల్దేరారు. కిత్తూరురాణిచెన్నమ్మ జంక్షన్ నుంచి కామాక్య వైపు వెళ్తుండగా పై వంతెన వద్ద ప్రైవేటు స్కూల్ బస్ ఢీకొంది. దీంతో ముగ్గురూ కిందపడిపోయారు. ఆ సమయంలో వెనుకనుంచి వస్తున్న బస్సు కీర్తన తలపై దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందింది. కీర్తన ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షల్లో ఉత్తీర్ణురాలైంది. హర్షితా ద్వితీయ పీయూసీ పరీక్ష రాసి ఫలితాలు కోసం వేచిచూస్తోందని బనశంకరి ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.
నీళ్ల ట్యాంకర్ ఢీకొని చిన్నారి..
బనశంకరి: వాటర్ ట్యాంకర్ ఢీకొని మూడేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన హెచ్‌ఎస్‌ఆర్.లేఔట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సర్జాపుర రోడ్డులోని శ్వేతా రెసిడెన్సీ అపార్టుమెంట్ ఎదురుగా గురువారం వాటర్ ట్యాంకర్ నీటిని అన్‌లోడ్ చేసి రివర్స్ తీసుకుంటున్న సమయంలో వెనుక ఉన్న బాలికపై దూసుకెళ్లింది. దీంతో బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. బాలిక పేరు ప్రతిష్టగా పోలీసులు గుర్తించారు. బాలికను కోల్పోయిన తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. హెచ్‌ఎస్‌ఆర్.లేఔట్ పోలీసులు డ్రైవర్‌ను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేపట్టారు.
(చదవండి: ఆసుపత్రి బిల్లు రూ.9.5 కోట్లు)
Comments
Please login to add a commentAdd a comment