సాక్షి, చెన్నై: విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై ఓ పర్యాటక వ్యాన్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో స్పెషల్ ఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుల్ మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటనపై సీఎం ఎంకే స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వివరాలు.. నామక్కల్ జిల్లా పుదుచత్రం ఏకే సముద్రం జాతీయ రహదారిలో ఆదివారం వేకువ జామున ఓ కారు డివైడర్‌ను ఢీ కొట్టింది. అదే సమయంలో మరో లారీ సైతం అదే ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. సమాచారం అందుకున్న పుదుచత్రం, రాశిపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గురైన కారులో చిక్కుకున్న నలుగుర్ని రక్షించారు. స్వల్పగాయాల పాలైన వారికి అక్కడే ప్రథమ చికిత్స అందించారు. రోడ్డుకు అడ్డంగా ఆగిన కారు, లారీని తొలగించేందుకు ఏర్పాట్లు చేశారు.
వేగంగా దూసుకొచ్చి..
తొలగింపు పనుల్లో నిమగ్నమైన పోలీసులు, రెవెన్యూ సిబ్బందిపైకి ఓ పర్యాటక వ్యాన్ దూసుకెళ్లింది. ఈ హఠాత్పరిణామం నుంచి తేరుకునేలోపే భారీ నష్టం.. జరిగిపోయింది. పుదుచత్రం స్టేషన్ స్పెషల్ ఎస్‌ఐ చంద్రశేఖర్(55), రాశిపురం స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ దేవరాజన్(35) ఘటనా స్థలంలోనే మరణించారు. మరో ఇద్దరు పోలీసులు, రెవెన్యూ శాఖకు చెందిన ఇద్దరు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వీరిని చికిత్స నిమిత్తం రాశిపురం ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఉన్నతాధికారులు ఘటనపై దర్యాప్తురు. దేవరాజన్, చంద్రశేఖర్ మృత దేహాల్ని పోస్టుమార్టానికి తరలించారు. ఈ సమాచారంతో సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ, తలా రూ. 25 లక్షలు ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు.
రిటైర్డ్ ఇన్‌స్పెక్టర్‌ను బలిగొన్న బైక్ రేసింగ్
చెన్నై శివారులోని వండలూరు ఎక్స్‌ప్రెస్ వేలో యువకులు బైక్ రేసింగ్‌లో దూసుకెళ్లడం పరిపాటిగా మారింది. ఈ పరిస్థితుల్లో ఆదివారం ఉదయం అరుంబాక్కంకు చెందిన రిటైర్డ్ మహిళా ఇన్‌స్పెక్టర్ సెల్వకుమారి మేల కోట్టై పోలీసు క్వార్టర్స్ నుంచి బైక్‌లో బయలు దేరారు. మార్గం మధ్యలో బైక్ రేసింగ్‌లో ఉన్న యువకులు ఆమె వాహనాన్ని ఢీ కొట్టారు. దీంతో ఘటనా స్థలంలోనే ఆమె మృతి చెందింది. బైక్ రేసింగ్‌లో దూసుకొచ్చిన ఓ యువకుడు ఒకడు గాయపడ్డాడు. మిగిలిన వారు పరారయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment