ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, చెన్నై: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కుమార్తెకు కుటుంబీకులు ఇంట్లోనే ప్రసవం చేశారు. ఆమె మృతిచెందడం, బిడ్డ చెత్త కుండీలోకి వెళ్లడం వెరసి ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆమె ప్రియుడు, కుటుంబసభ్యుల్ని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. దిండుగల్ జిల్లా పళని సమీపంలోని ఆరుకుడికి చెందిన మణియన్ కుమార్తె మంగయకరసి(29) ప్రైవేటు స్కూల్ టీచర్. 2019లో కోవిడ్ రూపంలో ఎదురైన లాక్‌డౌన్‌తో ఇంట్లోనే ఉంటూ ఆన్‌లైన్ క్లాసులు తీసుకుంటూ వచ్చింది.
ఈ సమయంలో వారి ఇంట్లో ఉన్న సమీప బంధువు యువకుడికి మంగయ కరసి దగ్గరైంది. ఇద్దరు చనువుగా ఉన్నా, కుటుంబీకులు ఏ మాత్రం పట్టించుకోలేదు. ఇందుకు కారణం, ఆ యువకుడు మంగయకరసికి తమ్ముడి వరుస కావడమే. అయితే, వీరి చనువు హద్దులు దాటినట్టుంది. మంగయ కరసి గర్భం దాల్చడం, అబార్షన్ కూడా చేయలేని పరిస్థితి నెలకొనడంతో ఆ కుటుంబం తీవ్ర మనో వేదనలో పడింది. వరసకు తమ్ముడి రూపంలో ఆమె గర్భం దాల్చిన సమాచారం బయటకు పొక్కితే కుటుంబ పరువు పోతుందని జాగ్రత్త పడ్డారు. ఆమెను ఇంట్లోనే ఉంచారు.
చదవండి: మహిళ మెడకు చున్నీ బిగించి.. 23 రోజుల తర్వాత!
ఇంట్లోనే ప్రసవం..
కొద్ది రోజుల క్రితం పురుటినొప్పులు రావడంతో ఇంట్లోనే కుటుంబీకులు ప్రసవం చేశారు. మగబిడ్డకు ఆమె జన్మనిచ్చింది. అయితే, తీవ్ర రక్తస్త్రావంతో మంగయకరసి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో, ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. దీంతో ఆ బిడ్డను తీసుకెళ్లి చెత్త కుండీలో పడేశారు. ఇంత వరకు ఎవరి కంటా పడకుండా జాగ్రత్త పడ్డా, మంగయ కరసి ఆస్పత్రిలో మృతిచెందడం, ఆగమేఘాలపై మృతదేహానికి అంత్యక్రియలు జరగడం ఇరుగుపొరుగు వారిలో అనుమానాల్ని రేకెత్తించాయి. వ్యవహారం పోలీసుల దృష్టికి చేరడంతో బండారం బయటపడింది.
దీంతో ఇంట్లో ప్రసవం చేసిన విషయం తెలిసి ఆమె తల్లి తంగం, సోదరి గణేషప్రియ, తమ్ముడు కాళిదాసులను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే, ఆమె గర్భానికి కారుకుడైన ప్రియుడు అదిష్‌కుమార్‌ను కూడా అరెస్టు చేశారు. అయితే, చెత్తకుండీలో బిడ్డను పడేసిన సమయంలో ప్రాణాలతో ఉన్నట్టుగా కాళిదాసు పేర్కొనడంతో ఆ బిడ్డ జాడ కోసం పోలీసులు అన్వేషణ మొదలెట్టారు. ఎవరికైనా ఆ బిడ్డ దొరికిందా లేదా మరణించిందా అని ఆరా తీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment