పోలీసులు అరెస్టు చేసిన డేనియల్, అతని వాహనం
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ నుంచి కొరియర్‌లో మాదకద్రవ్యమైన కొకైన్‌ను నగరానికి అక్రమ రవాణా చేసి విక్రయిస్తున్న ముఠాలో ఓ నైజీరియన్‌ను దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ ఆదివారం పట్టుకున్నారు. ఇతడికి ఈ డ్రగ్ సరఫరా చేస్తున్న వ్యక్తి సైతం నైజీరియనే అని డీసీపీ చక్రవర్తి గుమ్మి పేర్కొన్నారు. నైజీరియాలోని లాగోస్ రాష్ట్రానికి చెందిన డేనియల్ అయోటుండే ఓలమెడే 2014లో స్టూడెంట్ వీసాపై నగరానికి వలసవచ్చాడు. షేక్‌పేటలోని డ్రీమ్ వ్యాలీ సమీపంలో నివసిస్తూ కూకట్‌పల్లిలోని ప్రైవేట్ కాలేజీ నుంచి డిగ్రీ చదువుతున్నాడు. డ్రగ్స్ వినియోగానికి బానిసగా మారిన ఇతడికి ఢిల్లీలో ఉండే మరో నైజీరియన్ జాన్ పాల్‌తో పరిచయం ఏర్పడింది.
చదవండి: హైదరాబాద్: స్టాంప్ పేపర్లు కావలెను!
ఇద్దరూ కలిసి హైదరాబాద్‌లో డ్రగ్స్ దందా చేయాలని నిర్ణయించుకున్నారు. జాన్ అప్పుడప్పుడు నేరుగా వచ్చి, మిగిలిన సందర్భాల్లో కొరియర్ ద్వారా కొకైన్ పంపుతున్నాడు. దీన్ని డేనియల్ నగరంలోని కస్టమర్లకు ఒక్కో గ్రాము రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు విక్రయిస్తున్నాడు. ఇలా వచ్చిన లాభాన్ని ఇద్దరూ సమానంగా పంచుకుంటున్నారు. ఇదే ఆరోపణలపై గతేడాది అక్టోబర్‌లో లంగర్‌హౌస్ పోలీసులకు పట్టుబడ్డాడు. ఆ కేసులో జాన్ ఇప్పటికీ వాంటెడ్‌గా ఉన్నాడు. బెయిల్‌పై బయటకు వచ్చిన డేనియల్ తన పంథా మార్చుకోకుండా డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నాడు.
చదవండి: హైదరాబాద్ ఆర్టీసీ: ఇక అందరికి రూట్ పాస్‌లు!
దీనిపై దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎస్.రాఘవేంద్రకు సమాచారం అందింది. ఆయన నేతృత్వంలో ఎస్సైలు వి.నరేందర్, ఎన్.శ్రీశైలం, మహ్మద్ థకియుద్దీన్, కె.చంద్రమోహన్ వలపన్నారు. ఆదివారం జీవీకే సమీపంలో ద్విచక్రవాహనంపై డ్రగ్స్ డెలివరీ చేయడానికి వెళ్తున్న డేనియల్‌ను పట్టుకున్నారు. ఇతడి నుంచి నాలుగు గ్రాముల కొకైన్, వాహనం స్వా«దీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం పంజగుట్ట పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న జాన్ కోసం గాలింపు ముమ్మరం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment