బాధితుడికి టీడీపీ నేత బెదిరింపులు | TDP leader threatened Yuvagalam victim | Sakshi
Sakshi News home page

బాధితుడికి టీడీపీ నేత బెదిరింపులు

Published Tue, Feb 7 2023 3:59 AM | Last Updated on Tue, Feb 7 2023 3:59 AM

TDP leader threatened Yuvagalam victim - Sakshi

టీడీపీ 2024 టార్గెట్‌ వాట్సాప్‌ గ్రూప్, బాధితుడు డబ్బులు చెల్లించిన ఫోన్‌పే స్క్రీన్‌ షాట్‌

చంద్రగిరి(తిరుపతి జిల్లా)/ఒంగోలు టౌన్‌: తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడిపై టీడీపీ నేత బెదిరింపులకు పాల్పడ్డాడు. ‘నువ్వు ఎవరి దగ్గరకు వెళ్లినా నన్నేమీ చేయలేవు.. నీ అంతు చూస్తా’ అంటూ తీవ్ర పదజాలంతో బెదిరించాడు. దీంతో తనకు రక్షణ కల్పించాలంటూ బాధితుడు సోమ­వారం పోలీసులను ఆశ్రయించాడు. కాకి­నాడకు చెందిన టీడీపీ నేత మనోహర్‌చౌదరి ‘యువగళం మన­కోసం’ అనే వాట్సాప్‌ గ్రూప్‌ను క్రియే­ట్‌ చేశాడు. అందులో రుణాలు ఇస్తానని నమ్మబలికి.. తిరుపతి జిల్లా పనపాకం పంచాయతీకి చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.1.43 లక్షలు కాజేశాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ విషయం తెలుసుకున్న మనోహర్‌చౌదరి తనకు సోమవారం ఫోన్‌ చేసి ‘నీ ఆధార్‌కార్డు, బ్యాంకు అకౌంట్‌ వివరాలు నావద్దే ఉన్నా­యి. నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తా. పోలీసు అధికారులు నా చేతిలో ఉన్నారు. నా మనుషులు నీ గ్రామానికే వచ్చి అంతు చూస్తారు. నీకు జీతం రాకుండా అడ్డుకుంటా.. ఈనెల 10లోపు నోటీసులు కూడా పంపిస్తా. ఏ నాయకుడు కూడా నన్ను ఏమీ చెయ్యలేడు. నా నెట్‌వర్క్‌ ఎలా ఉంటుందో చూపిస్తా’ అంటూ బెదిరించాడని బాధితుడు వాపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తును వేగవంతం చేశారు. మనోహర్‌చౌదరికి చెందిన రెండు బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్‌ చేశారు.  

‘టీడీపీ 2024 టార్గెట్‌’ పేరుతో ఒంగోలులో కుచ్చుటోపీ 
వాట్సాప్‌ గ్రూప్‌లు క్రియేట్‌ చేసి మనోహర్‌ చౌదరి చేసిన మోసాలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. ‘టీడీపీ 2024 టార్గెట్‌’ అనే పేరుతో మరో వాట్సాప్‌ గ్రూప్‌ను క్రియేట్‌ చేసిన మనోహర్‌ చౌదరి.. రూ.5 లక్షల వరకు రుణాలిస్తామంటూ ఆశపెట్టి పలువురిని మోసం చేశాడు. ఒంగోలులోని వేంకటేశ్వర కాలనీకి చెందిన ఎంఏ సాలార్‌ ‘టీడీపీ 2024 టార్గెట్‌’ అనే వాట్సాప్‌ గ్రూప్‌లో సభ్యుడిగా ఉన్నాడు. ఆ గ్రూప్‌ అడ్మిన్‌ అయిన మనోహర్‌చౌదరి శ్రీసాయి మైక్రోఫైనాన్స్‌ పేరుతో రూ.5 లక్షల వరకు రుణాలిస్తానని గ్రూప్‌లో మెసేజ్‌ పెట్టాడు. దీంతో సాలార్‌.. మనోహర్‌ను సంప్రదించాడు.

అతని నుంచి ఆధార్, పాన్‌ కార్డు, బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకున్న మనోహర్‌చౌదరి.. వివిధ ఫీజుల పేర్లతో రూ.43వేలకు పైగా వసూలు చేశాడు. మరో రూ.30 వేలు అడగడంతో అనుమానం వచ్చిన బాధితుడు తన డబ్బులు ఇచ్చేయాలని మనోహర్‌చౌదరిని నిలదీశాడు. దీంతో సాలార్‌ను వాట్సాప్‌ గ్రూప్‌ నుంచి తొలగించాడు. మోసపోయినట్లు గ్రహించిన బాధి­తుడు ఇటీవల ఒంగోలు తాలూకా సీఐకి ఫిర్యాదు చేశాడు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement