తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా కుంచనపల్లిప్రాతూరు రోడ్డులో ఉన్న ఏపీ సీఐడీ సిట్ కార్యాలయం వద్ద మంగళవారం తెలుగు యువత నాయకులు, కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. సిట్ కార్యాలయం గోడలు దూకేందుకు ప్రయత్నం చేశారు. అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో వీఆర్వో ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
ఎస్‌ఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం... ఏపీ సీఐడీ కార్యాలయం వద్ద ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు విషయమై టీడీపీ నాయకుడు నారా లోకేశ్‌ను సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. ఆ సమయంలో బయటవారిని ఎవరినీ అనుమతించకుండా రెవెన్యూ, పోలీసుల ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినా కొందరు తెలుగు యువత నాయకులు... సిట్ కార్యాలయం వెనుక వైపు గోడదూకి లోపలికి వచ్చేందుకు ప్రయత్నించారు.
అక్కడ ఉన్న సెక్యూరిటీ, రెవెన్యూ సిబ్బంది వారిని అడ్డుకుని లోపలికి రావొద్దని పదేపదే చెప్పినా వినకుండా గోడదూకేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకోవడంతో దౌర్జన్యానికి పాల్పడ్డారు. అక్రమంగా లోపలికి వచ్చేందుకు ప్రయత్నించినవారిపై వీఆర్వో మౌలాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం చిన్నబాబు, ప్రధాన కార్యదర్శి నూతలపాటి నాగభూషణం, అధికార ప్రతినిధి సజ్జ అజయ్, చందర్లపాడు మండల అధ్యక్షుడు కమ్మ గోపీచంద్, నందిగామకు చెందిన గుళ్లపల్లి ఠాగూర్‌బాబు, ఈపూరి వినోద్, ఏలూరు జిల్లా ఎన్‌ఆర్ పేటకు చెందిన నాయుడు పవన్ ఉన్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment