(మృతుని వద్ద దొరికిన లేఖ సారాంశం) సీఎం కేసీఆర్‌కు.. వర్షాకాలంలో సన్నరకం వరి వేయమన్నారు కానీ ధర లేదు. నేను మొత్తం సన్న రకం వరి వేశాను. దిగుబడి తక్కువ వచ్చింది. మద్దతు ధర లేదు. నీరు పుష్కలంగా ఉన్న నా పొలంలో వరిసాగు మాత్రమే అయితది. నేనేం వేయాలి.. కౌలు ఇచ్చిన వారికి ఏం ఇవ్వాలి.
మెదక్ రూరల్: వరి పంట వేయొద్దని ప్రభుత్వం సూచించడం.. కుమారుడికి అనారోగ్యం.. వెంటాడుతున్న అప్పులు.. ఇవన్నీ ఆ అన్నదాతను కుంగదీశాయి. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మెదక్ జిల్లా హావేలిఘనపూర్ మండలం బోగుడా భూపతిపూర్ గ్రామంలో శుక్రవారం రైతు కర్ణం రవికుమార్ (40) ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
బాధితుని కుటుంబ సభ్యులు, పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలివి. రైతు కర్ణం రవికుమార్, పెంటమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తెకు వివాహమైంది. చిన్న కుమార్తె దుబ్బాకలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. కుమారుడు సాయికుమార్ ఐదేళ్ల వయసు నుంచే హిమోఫీలియా అనే వ్యాధితో బాధపడుతుండటంతో ఎనిమిదో తరగతిలో చదువు మాన్పించారు.
వరి సాగు శాపమైంది
రైతు కర్ణం రవి తనకున్న మూడెకరాలతో పాటు మరో రెండు ఎకరాలను కౌలుకు తీసుకొని ప్రతి సీజన్‌లో వరిసాగు చేసేవాడు. ఇదే క్రమంలో వానాకాలంలో సన్న రకం వరి సాగు చేశాడు. మద్దతు ధర లేకపోవడం.. ఆశించిన మేర దిగుబడి రాక నష్టపోవలసి వచ్చింది. వ్యవసాయ అధికారులు ఇటీవల గ్రామంలో పర్యటించి వరి వేయకూడదని, ఆరుతడి పంటలనే సాగు చేయాలని చెప్పడంతో ఆందోళనకు గురయ్యాడు.
కుమారుడి వైద్యానికి రూ.18 లక్షల ఖర్చు
కుమారుడు సాయికుమార్ హిమోఫీలియా అనే వ్యాధితో బాధపడుతున్నాడు. వైద్యం కోసం ఇప్పటి వరకు రూ.18 లక్షలు ఖర్చు చేశాడు. ఇందులో రూ.10 లక్షలు అప్పు తీర్చగా, మరో రూ.8 లక్షల అప్పు ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పు తీర్చే క్రమంలో తనకున్న మూడెకరాల్లో ఆరు నెలల క్రితం 30 గుంటల భూమిని ఇతరులకు అమ్మేశాడు. కుమారుడి చికిత్సకు ప్రతి నెలా హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకు వెళ్లి ఐదు రోజులు ఐదు ఇంజెక్షన్లు ఇప్పించేవాడు.
ఇటీవల ఆ ఇంజక్షన్లు అందుబాటులో లేక, 67 ఏళ్ల తండ్రికి పింఛన్ రాకపోవడం తదితర ఆర్థిక సమస్యలతో కుంగిపోయాడు. రవికుమార్ (40) శుక్రవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో పొలం వద్దకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. పొలంలోనే పురుగుల మందు తాగాడు. ఎనిమిది గంటల సమయంలో కుమారుడు పొలం వద్దకు వెళ్లగా, తండ్రి ప్రాణాపాయ స్థితిలో కనిపించాడు. ఆస్పత్రికి తీసుకెళ్లే సమయంలోనే మృతి చెందాడు. సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖను మృతుని జేబులో గుర్తించారు.
అండగా నిలుస్తాం
మృతుడి కుటుంబానికి అండగా నిలుస్తామని ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని బాధితుని కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేశారు. మృతుని కుమారుడి వైద్య చికిత్సల కోసం అవసరమైన ఖర్చులను ప్రభుత్వం భరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రవి ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని కాంగ్రెస్ నాయకుడు మ్యాడం బాలకృష్ణ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు.
Comments
Please login to add a commentAdd a comment