తెలుగు అకాడమీ స్కాం: మరో రూ.20 కోట్లకు స్కెచ్‌! | Telugu Academy Scam Case: Sketch For Another Rs 20 Crore | Sakshi
Sakshi News home page

తెలుగు అకాడమీ స్కాం: మరో రూ.20 కోట్లకు స్కెచ్‌!

Published Tue, Oct 5 2021 3:27 AM | Last Updated on Tue, Oct 5 2021 10:46 AM

Telugu Academy Scam Case: Sketch For Another Rs 20 Crore - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు అకాడమీకి చెందిన రూ.63.47 కోట్ల నిధులను నొక్కేసిన కేటుగాళ్లు మరో రూ.20 కోట్లు కాజేయడానికి స్కెచ్‌ వేసిన విషయం వెలుగులోకి వచ్చింది. అకాడమీ ఇచ్చిన కవరింగ్‌ లెటర్లు మార్చి ఈ గ్యాంగ్‌ కథ నడిపినట్లు తేలింది. అకాడమీ అధికారులు సైతం తమకు చేరిన ఫిక్స్‌డ్‌ డిపా జిట్లకు (ఎఫ్‌డీ) సంబంధించిన నకిలీ బాండ్లను గుర్తించకపోవడంపై అనుమానాలు కలుగుతున్నాయని పోలీసులు చెప్తున్నారు. ఈ స్కామ్‌ సూత్రధారుల్లో ఒకడైన రాజ్‌కుమార్‌ అకాడమీకి– బ్యాంకులకు మధ్య దళారిగా వ్యవహరించేవాడు. అకాడమీ నిధులను కొల్లగొట్టడానికి యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ) చీఫ్‌ మేనేజర్‌ మస్తాన్‌ వలీ, సోమశేఖర్, శ్రీనివాస్‌లతో ముఠా కట్టి రంగంలోకి దిగాడు.

సుప్రీంకోర్టు కీలక ఆదేశాల నేపథ్యంలో..
గత ఏడాది డిసెంబర్‌ నుంచి గత నెల వరకు సంతోష్‌నగర్, కార్వాన్‌ల్లోని యూనియన్‌ బ్యాంక్‌ అఫ్‌ ఇండియా, చందానగర్‌ కెనరా శాఖల్లో ఉన్న రూ.63.47 కోట్లను ఈ ముఠా నొక్కేసింది. ఈ క్రమంలోనే చందానగర్‌లోని అదే బ్రాంచ్‌లో ఉన్న మరో రూ.20 కోట్ల ఎఫ్‌డీ సొమ్మునూ తమ ఖాతాల్లోకి మళ్లించడానికిగాను నకిలీపత్రాలను రూపొందించింది. మరోవైపు తెలంగాణ– ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీకి సంబంధించి గత నెల 14న సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇస్తూ ఆస్తులు, నిధులను నిర్దేశిత నిష్పత్తి ప్రకారం పంపకం చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు వాటి లెక్కలు చూడాలని డైరెక్టర్‌ సోమిరెడ్డి ఆదేశాలు జారీ చేయడంతో అకాడమీ అధికారులు ఈ నెల 18న బ్యాంకర్ల సమావేశం ఏర్పాటు చేసి గడువు తీరిన, తీరని ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు రద్దు చేయాలని కోరారు. ఈ మేరకు అకాడమీ అధికారులు లేఖలు రాయడంతోపాటు బాండ్లు అందించడంతో ఆ రూ.20 కోట్లు తెలుగు అకాడమీ ఖాతాలోకి వచ్చాయి. దీంతో ఈ ముఠా ప్లాన్‌ బెడిసికొట్టింది.

అతడు చిక్కితేనే స్పష్టత
సీసీఎస్‌ పోలీసులు సోమవారం సైతం అకా డమీ, బ్యాంకు అధికారులను ప్రశ్నించి వాం గ్మూలాలు నమోదు చేశారు. పరారీలో ఉన్న ఓ కీలక నిందితుడు చిక్కితే ఈ స్కామ్‌లో అకాడమీ అధికారుల పాత్రపై స్పష్టత వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. ఎఫ్‌డీల కోసం దళారుల సహకారం ఎందుకనే అంశాన్నీ సీరియస్‌ గా పరిశీలిస్తున్నారు. మంగళవారం మరికొం దరు నిందితులను అరెస్టు చేసే అవకాశాలు న్నాయి. రూ.6 కోట్లు ది ఏపీ మర్కంటైల్‌ కో– ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ లిమిటెడ్‌ చైర్మన్‌ సత్య నారాయణరావుకు చేరినట్లు తేలగా, మిగిలిన మొత్తం ఏమైందనే దానిపై ఆరా తీస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement