ప్రతీకాత్మక చిత్రం
సాక్షి,భీమడోలు(పశ్చిమగోదావరి): దొంగతనం కోసం వచ్చి నిద్రిస్తున్న మహిళను హత్య చేసిన దారుణ ఘటన గుండుగొలనులో శుక్రవారం పట్టపగలు జరిగింది. గుండుగొలనులోని వినాయకుని గుడి ఎదురు రోడ్డులో ఉద్దరాజు నాగమణి(54), సూర్యనారాయణరాజు దంపతులు అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. సూర్యనారాయణరాజు ఆక్వా రైతు వద్ద గుమాస్తాగా ఉంటున్నాడు. దీంతో రోజూ మాదిరిగానే ఉదయం 6 గంటలకు ఇంటి నుంచి బయలుదేరుతూ బయట తలుపుకు గెడ పెట్టి వెళ్లిపోయాడు. దుండగుడు(లు) గెడ తీసుకుని లోపలకు ప్రవేశించి బీరువాను పగులగొట్టాడు.
ఈ అలికిడికి నిద్రలేచిన నాగమణి కేకలు వేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అతను ఆమె నిద్రిస్తున్నమంచంపైగల తలగడతో ముఖాన్ని గట్టిగా నొక్కి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. దీనితో ఆమె ముఖంపై గాయాలయ్యాయి. ఆమె మెడలోనినానుతాడు, గొలుసు, చెవిదిద్దులు 4 కాసుల బంగారు ఆభరణాలతోపాటు రూ.4 వేల నగదు దొంగిలించి పరారయ్యాడు. ఆ తర్వాత ఆ ఇంటి పనిమనిషి రాగా నాగమణి విగత జీవిగా పడి ఉండటాన్ని చూసి స్థానికులు, కుటుంబ సభ్యులకు తెలిపింది. సమాచారం అందుకున్న సీఐ ఎం.సుబ్బారావు, భీమడోలు, దెందులూరు ఎస్సైలు వీఎస్‌వీ భద్రరావు, ఐ.వీర్రాజు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఏలూరు డీఎస్పీ దిలీప్‌కిరణ్ వివరాలను కుటుంబ సభ్యులు, స్థానికుల నుంచి అడిగి తెలుసుకున్నారు. సీసీఎస్ డీఎస్పీ పైడేశ్వరరావు పరిశీలించారు. క్లూస్ టీమ్ వేలిముద్రలు సేకరించింది. డాగ్ స్క్యాడ్ టీమ్ హత్య అనంతరం పరారైన నిందితుడి మార్గాన్ని గుర్తించారు. ఏలూరు డీఎస్పీ మాట్లాడుతూ హత్య కేసు ఛేదించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఎస్సై భద్రరావు మాట్లాడుతూ హత్యకు పాల్పడిన నిందితులు ఒకరా, ఇద్దరా అనేది తెలియాల్సి ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment