వివాహ సమయంలో నాగిణి, అవినాష్ (ఫైల్)
సాక్షి, గాజువాక (విశాఖపట్నం): ప్రేమ వ్యవహారం మూడు నిండు ప్రాణాలను బలి తీసుకొంది. తన భార్య మరో వ్యక్తితో పెళ్లికి సిద్ధమైందని తెలుసుకున్న భర్త మనస్తాపంతో నాలుగు రోజుల కిందట ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా ఆ వివాహిత ప్రేమించి పెళ్లాడిన భర్త (ప్రియుడు)తో కలిసి ఆత్మహత్య చేసుకుంది. స్థానిక సుందరయ్య కాలనీదరి దుర్గానగర్‌లో శుక్రవారం చోటుచేసుకున్న ఈ సంఘటనపై సౌత్ ఏసీపీ జి.ఆర్.రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
పరవాడ మండలం పి.బోనంగి గ్రామానికి చెందిన మోటూరి నాగిణి (24) అదే గ్రామానికి చెందిన బోకం అవినాష్ (28)ను ప్రేమించింది. అయితే ఆమె తల్లిదండ్రులు పాపారావు అనే వ్యక్తికి ఇచ్చి ఐదేళ్ల కిందట వివాహం జరిపించారు. అనంతరం ఉపాధి కోసం పాపారావు తన భార్యతో కలిసి అండమాన్ వెళ్లిపోయాడు. అక్కడే ఓ ప్రైవేట్ కంపెనీలో ఎలక్ట్రిషియన్‌గా పని చేస్తూ నివాసముంటున్నాడు. వాళ్ల కాపురం నాలుగేళ్లపాటు సాఫీగానే సాగింది. అయితే బోనంగిలోని తమ పుట్టింటికి నాగిణి అండమాన్‌నుంచి వచ్చింది. పెళ్లికి ముందే ప్రేమించిన అవినాష్‌తో చనువుగా తిరుగుతోంది. ఈ క్రమంలో నాగిణిని అండమాన్ పంపేందుకు ఆమె తల్లిదండ్రులు రెండుసార్లు టికెట్లు తీసినా వెళ్లలేదు. తన భార్యకు అవినాష్‌కు మళ్లీ సంబంధం ఏర్పడిందన్న విషయం తెలుసుకున్న పాపారావు తీవ్ర మనస్తాపానికి గురై నాలుగు రోజుల కిందట ఆత్మహత్య చేసుకొన్నాడు. చదవండి: (విషాదం: పోలీస్ దంపతుల ఆత్మహత్య)
ఇదిలా ఉండగా, నాగిణి, అవినాష్‌లు ఈనెల 16న ఇంటినుంచి బయటకు వెళ్లిపోయారు. రాత్రి గస్తీ నిర్వహిస్తున్న పోలీసులకు వారు పరవాడ దరి వాంబేకాలనీలో కనిపించడంతో పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి కౌన్సెలింగ్ నిర్వహించారు. అయినప్పటికీ గురువారం ఉదయం కశింకోటలోని దుర్గా గుడిలో వివాహం చేసుకొని అవినాష్ ఇంటికి వెళ్లారు. అతడి తల్లిదండ్రులు ఈ వివాహాన్ని అంగీకరించకపోవడంతో ఇక్కడి దుర్గానగర్‌లోని తమ బంధువుల ఇంటికి వచ్చారు. శ్రీనగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుంటున్నామని, ఇక్కడే కాపురముంటామని చెప్పిన వారిద్దరూ ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు.
భార్యాభర్తలమని ఇంటి యజమానికి చెప్పి ఆ ఇంటికి అడ్వాన్స్ చెల్లించారు. రెండు రోజుల్లో సామగ్రి తెచ్చుకుంటామని ఇంట్లో దిగారు. శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలు దాటుతున్నా తలుపులు తెరవకపోవడంతో ఇంటి యజమాని వెళ్లి చూశాడు. ఇద్దరూ ఆ ఇంట్లో ఫ్యాన్ హుక్‌కు ఉరి పోసుకొని కనిపించడంతో గాజువాక పోలీసులకు సమాచారం అందించాడు. ఈ విషయం తెలుసుకున్న నాగిణి తల్లిదండ్రులు సంఘటనా స్థలంలో తమ బిడ్డ నిర్జీవంగా ఉండడం చూసి బోరున విలపించారు. చదవండి: (పెళ్లయినా మరదలిపై కన్నేసి.. ఎంత పనిచేశాడంటే..!)
సమాచారం అందుకున్న సౌత్ ఏసీపీ జి.ఆర్.రెడ్డి, గాజువాక సీఐ మల్లీశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రాథమిక విచారణ నిర్వహించారు. కుటుంబ సభ్యుల నిరాకరణ, భర్త ఆత్మహత్య చేసుకున్నాడన్న మనస్తాపమో, మరేదైనా కారణం చేతనో వారు ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని ఏసీపీ పేర్కొన్నారు. పూర్తిస్థాయి విచారణలో వాస్తవాలు తెలుస్తాయన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కేజీహెచ్‌కు తరలించారు. కాగా, మృతుల గదిలో సూసైడ్ నోట్ లభించింది. తమ చావుకు ఎవరూ కారణం కాదని, తమ ప్రేమను కాదంటున్నారనే కారణంతోనే ఆత్మహత్య చేసుకొంటున్నామని ఆ లేఖలో పేర్కొన్నట్టు ఏసీపీ తెలిపారు. తమ మృతదేహాలను ఒకేచోట ఖననం చేయాలని వారు ఆ లేఖలో కోరారు. చదవండి: (మా చావుకు అమ్మే కారణం.. ఎప్పటికీ క్షమించను)
Comments
Please login to add a commentAdd a comment