
ఇస్తాంబుల్: వివాదాస్పద ముస్లిం ప్రబోధకుడు అద్నన్ అక్తర్‌కు టర్కీ కోర్టు కఠిన కారాగార శిక్ష విధించింది. మైనర్లపై లైంగిక దాడులు, ఆర్మీ గూఢచర్యం, బ్లాక్‌మెయిలింగ్ తదితర కేసుల్లో దోషిగా తేల్చి.. మొత్తంగా 1,075 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. స్థానిక మీడియా వివరాల ప్రకారం... అద్నన్ అక్తర్ ఓ ప్రైవేటు టీవీ చానెల్ ద్వారా మతపరమైన బోధనలు చేస్తూ పాపులర్ అయ్యాడు. మహిళల నడుమ కూర్చుని విలాసవంతమైన జీవితాన్ని ప్రతిబింబించేలా తెరపై దర్శనమిస్తూ చర్చలు నిర్వహించేవాడు. వారిని కిటెన్స్ అని పిలుస్తూ అసభ్యకర రీతిలో వ్యవహరించేవాడు.
ఈ క్రమంలో అతడి కార్యకలాపాలపై నిఘా పెట్టిన టర్కీ మీడియా వాచ్‌డాగ్ ఇప్పటికే అతడి చానెల్‌పై నిషేధం విధించింది. మరోవైపు స్థానిక పోలీసులు, అవినీతి నిరోధక శాఖ అధికారులు అద్నన్ నివాసాలపై దాడులు చేసి, 2018లో అతడిని అరెస్టు చేశారు. అతడితో పాటు పదుల సంఖ్యలో అనుచరులను కూడా అదుపులోకి తీసుకున్నారు. నేరాలను, నేరస్తులను ప్రోత్సహించడం సహా మైనర్లను లైంగికంగా వేధించడం, వారిపై అత్యాచారాలకు పాల్పడటం, బ్లాక్‌మెయిల్ చేయడం, రాజకీయ, సైనిక రంగాల్లో గూఢచర్యం నెరపినందుకు గానూ అద్నన్‌పై అభియోగాలు నమోదు చేశారు.(చదవండి: ప్రిన్సెస్ డయానాలో ఉన్న ఆకర్షణ అదే: మాజీ లవర్)
ఈ నేపథ్యంలో 10 ప్రధాన కేసుల్లో అతడిని దోషిగా తేల్చిన న్యాయస్థానం అతడికి ఈ మేరకు శిక్ష విధించింది. అతడి ఫాలోవర్లలో 13 మందికి సైతం కఠిన కారాగార శిక్షలు విధించింది. కాగా ఈ విషయంపై స్పందించిన 64 ఏళ్ల అద్నన్.. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించాడు. తాను ఏ తప్పు చేయలేదని, పథకం ప్రకారమే కుట్ర పన్ని ఇరికించారని, కోర్టు తీర్పుపై అప్పీలు చేస్తానని చెప్పుకొచ్చాడు. ఇక మత ప్రబోధనలతో పాటు రచయితగా కూడా అద్నన్ పేరు సంపాదించాడు. డార్విన్ జీవపరిణామక్రమానికి సంబంధించిన అంశాలపై హరున్ యహయా అనే కలం పేరుతో రచనలు చేశాడు.
నాకు 1000 మంది గర్ల్‌ఫ్రెండ్స్
అనేకానేక సెక్స్ స్కాండల్స్‌తో 90వ దశకంలో వెలుగులోకి వచ్చిన అద్నన్ అనేక అక్రమాలకు పాల్పడ్డట్లు రుజువైంది. ఈ క్రమంలో ఇటీవల కాలంలో ప్రిసైడింగ్ జడ్జి ఎదుట హాజరైన అతడు.. ‘‘ ఆడవాళ్లను చూస్తే నా గుండె ప్రేమతో ఉప్పొంగిపోతుంది. ప్రేమించడం అనేది మానవ సహజ లక్షణం. నేను అదే చేశాను. నాకు దాదాపు వెయ్యి మంది గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు. వారందరినీ సంతోషపెట్టగల అసాధారణ సామర్థ్యం నాకుంది’’ అంటూ అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. కాగా అమ్మాయిలకు ప్లాస్టిక్ సర్జరీలు చేయించి వారితో అర్ధనగ్న ప్రదర్శనలు చేయించేవాడని కూడా అతడిపై ఆరోపణలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment