పిఠాపురం(తూర్పుగోదావరి): స్థానిక వై.జంక్షన్ సమీపంలో గొల్లప్రోలు టోల్‌గేటు వద్ద గొర్రిఖండి కాలువ వద్దకు ఆదివారం సరదాగా ఫొటోలు తీసుకుందామని వెళ్లిన ఐదుగురు స్నేహితుల్లో ఇద్దరు మృతిచెందారు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం మార్కెట్ వీధికి చెందిన నాంపల్లి నగేష్, కత్తులగూడెంకు చెందిన కూరాకుల భాను, తమ్మనబోయిన వెంకటసాయి, శిస్టి కరణాల వీధికి చెందిన కొండమహంతి వాసు (16), వేణుం తేజ (16) చిన్ననాటి స్నేహితులు. అందరూ ఒకే స్కూలులో ఒకటో తరగతి నుంచి చదువుకున్నారు. ప్రస్తుతం స్థానిక ప్రైయివేటు స్కూలులో పదవ తరగతి చదువుతున్నారు.
ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఐదుగురు కలిసి పిఠాపురం వై.జంక్షన్ వద్ద ఉన్న తోటలోకి వెళ్లారు. అక్కడే ఉన్న గొర్రిఖండి కాలువ వద్ద కాసేపు సరదాగా తిరిగి సెల్ఫీలు తీసుకునే ప్రయత్నం చేశారు. గొర్రిఖండి కాలువ వడి ఎక్కువగా ఉండడంతో భయపడిన స్నేహితులు అందరూ ఇక ఇంటికి వెళ్లిపోదాం అనుకుని బయలుదేరగా వేణుం తేజ చేయి కడుక్కుని వస్తానని చెప్పి కాలువలోకి దిగాడు. చేయి కడుగుతుండగా కాలు జారి కాలువలోకి పడిపోవడంతో అతనిని రక్షించడానికి మిగిలిన స్నేహితులు ప్రయత్నించారు. కొండమహంతి వాసు తనకు ఈత వచ్చని చెప్పి కాలువలోకి దూకి స్నేహితుడిని రక్షించే ప్రయత్నం చేశారు. ఇద్దరూ గల్లంతయ్యారు. గొల్లప్రోలు ఎస్సై రామలింగేశ్వరరావు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని అగి్నమాపక సిబ్బంది సహాయంతో గాలింపు చర్యలు చేపట్టగా ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి.
పదవ తరగతి ఫస్టు క్లాసులో పాసవుతానని చెబుతూ ఎప్పుడు చదువుకుంటూ ఉండే కన్న కొడుకు కానరాని లోకాలకు వెళ్లిపోతాడని కలలో కూడా అనుకోలేదని మృతుడు తేజ తల్లిదండ్రులు జ్యోతి, శ్రీను గుండెలవిసేలా రోదించారు. పరీక్షలు రాయకుండానే పోయావా నాన్నా అంటూ వారు విలపించారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఒక్కగానొక్క కొడుకు అందివస్తున్నాడనుకుంటే అందని లోకాలకు వెళ్లి పోయాడని, ఇక తాము ఎవరి కోసం బతకాలని వాసు తల్లిదండ్రులు నాగలక్ష్మి చినబాబు ఏడుస్తున్న తీరు చూపరులకు కంటతడి పెట్టించింది.
మృతదేహాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే
తేజ మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ఆదివారం రాత్రి ఎమ్మెల్యే పెండెం దొరబాబు పరిశీలించారు. మృతుని కుటుంబ సభ్యులను అండగా ఉంటామని తెలిపారు.
మృత్యుకూపంగా గొర్రిఖండి కాలువ
పిఠాపురం వై.జంక్షన్ వద్ద ఉన్న గొర్రిఖండి కాలువ మృత్యుకూపంగా మారింది. ఇప్పటి వరకు కాలువలో పడి పలువురు మృతిచెందారు. ఇక్కడ కాలువ పది అడుగులకు పైగా లోతుగా వడితో ఉండడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రవాహ వేగం ఎక్కువగా ఉండడంతో పాటు గట్లు నాచుకట్టి ఉండడంతో కాలువలోకి జారిపడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
చదవండి:
ఆర్మీ అధికారి భార్య, కూతురు ఆత్మహత్య
విషాదం: 20 అడుగుల ఎత్తుకు ఎగిరి..
Comments
Please login to add a commentAdd a comment