సాక్షి, సిటీబ్యూరో: ద్విచక్ర వాహనంపై ఇద్దరి కంటే ఎక్కువ మంది ప్రయాణించడం సర్వసాధారణమైంది. ప్రధానంగా యువతే ఈ ఉల్లంఘనకు పాల్పడుతూ నిత్యం ప్రమాదాల బారినడుతున్నారు. బుధవారం తెల్లవారుజామున మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పురానాపూల్ హరా దర్వాజా వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. నగరంలో తరచు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మంగళ్‌హాట్ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రుడు సైతం మద్యం తాగి ఉన్నారని, దీని వల్ల ప్రమాద తీవ్రత పెరిగిందని పోలీసులు పేర్కొంటున్నారు. ద్విచక్ర వాహనాలపై ఇద్దరి కంటే ఎక్కువ మంది ప్రయాణించే వారిలో యువకులే ఎక్కువగా ఉంటున్నారు. సాధారణంగా టూ వీలర్స్ వినియోగించేది వీరే ఎక్కువ కావడంతో ప్రమాదాలబారిన పడుతున్న వారిలో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉంటోంది. బంధువుల కంటే స్నేహితులతో కలిసే ఎక్కువగా ట్రిపుల్ రైడింగ్‌కు పాల్పడుతుంటారు. ఎక్కడైనా ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు కనిపించినా... జంక్షన్ వచ్చినా... ఆఖరులో కూర్చున్న యువకుడు తక్షణం దిగిపోయి నడుస్తూ ముందుకు వెళ్లడం పరిపాటి. ఇలా చేస్తూ ట్రిపుల్ రైడర్లు అనేక సందర్భాల్లో పోలీసులను పక్కదారి పట్టిస్తున్నారు. ఇలా దూసుకుపోతూ తరచు ప్రమాదాలకు లోనవుతున్నారు.
అదుపు అసాధ్యం...
ప్రతి వాహనానికీ దానిని తయారు చేసే కంపెనీ కొన్ని ప్రమాణాలు నిర్దేశిస్తుంది. ఇందులో భాగంగానే టూ వీలర్‌ను కేవలం ఇద్దరు వినియోగించడానికి వీలుగానే రూపొందిస్తుంది. ముందు డ్రైవర్, వెనుక పిలియన్ రైడర్ మాత్రమే ప్రయాణించాలంటూ తమ నిబంధనల్లో స్పష్టం చేస్తుంది. దీనికి సాంకేతికంగానూ ప్రత్యేక కారణాలు ఉన్నాయి.
ఇంజిన్ కెపాసిటీ: మోటారు వాహనాలకు ఉండే ప్రతి ఇంజిన్‌కు ప్రత్యేక సామర్థ్యం ఉంటుంది. దీనిని సాంకేతికంగా ఇంజిన్ కెపాసిటీ అంటారు. ఆ వాహనం ఎందరు ప్రయాణించడానికి అనువుగా రూపొందిస్తారో... అదే సామర్థ్యంలో ఇంజిన్ అభివృద్ధి చేస్తారు. నిర్దేశించిన ప్రయణికుల కంటే ఎక్కువ మంది ఆ వాహనంపై ప్రయాణిస్తే దాని ప్రభావం ఇంజిన్‌పై పడుతుంది.
యాక్సిలరేటింగ్ కెపాసిటీ: ఓ వాహనం ఎంత వేగంతో దూసుకుపోవాలనేది స్పష్టం చేసేదే యాక్సిలరేటింగ్ కెపాసిటీ. సదరు వాహనంపై పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కినప్పుడు ఈ కెపాసిటీ తగ్గుతుంది. సాధారణంగా గంటకు 60 కిమీ వేగంతో దూసుకుపోయే వాహనం ఇలాంటప్పుడు 40 కిమీ మించదు. ఈ ప్రభావం ఓవర్‌టేకింగ్ తదితర సమయాల్లో ప్రమాదాలకు కారణమవుతుంది.
బేకింగ్/బ్యాలెన్సింగ్ కెపాసిటీ: ఏదైనా వాహనం ప్రమాదానికి లోనుకాకుండా ఉండాలంటే ఈ రెండూ అత్యంత కీలకం. సరైన సమయానికి బ్రేక్ వేయగలగటం, అవసరమైన స్థాయిలో బ్యాలెన్స్ చేసుకోవడం తప్పనిసరి. అయితే ట్రిపుల్ రైడింగ్ వంటివి చేసినప్పుడు ఈ ప్రభావం ఈ రెండు కెపాసిటీల పైనా పడి... ఎదురుగా ముప్పును గుర్తించినా తక్షణం స్పందించి వాహనాన్ని ఆపలేరు.
ఈ ఏడాది జరిగిన ‘ట్రిపుల్’ యాక్సిడెంట్స్‌లో కొన్ని...
♦రామ్‌నగర్‌కు చెందిన గోపీకృష్ణ తన స్నేహితురాళ్లు అనూష, పల్లవితో కలిసి తన బైక్‌పై సంఘీ టెంపుల్‌కు వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు. గోపి మృతి చెందగా.. మిగిలిన ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.
♦ఛత్తీస్‌గఢ్ నుంచి వలసవచ్చిన సురేష్ అహ్మద్‌గూడ వద్ద మోది కన్‌స్ట్రక్షన్స్‌లో పని చేసేవాడు. భార్య రాధిక, బావమరిది ఉదయ్‌లతో పాటు చిన్నారుల్ని తీసుకుని బైక్‌పై వెళ్తూ ప్రమాదానికి గురయ్యాడు. సురేష్ మరణించగా మిగిలిన వారు క్షతగాత్రులయ్యారు.
♦డీ పోచంపల్లికి చెందిన సాయి తన స్నేహితులు కృపాకర్, విష్ణులతో కలిసి బైక్‌పై వెళుతుండగా జరిగిన ప్రమాదంలో సాయి చనిపోగా... మిగిలిన ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.
♦తాగాజా బుధవారం తెల్లవారుజామున మంగళ్‌హాట్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఇద్దరు చనిపోగా... మరొకరు క్షతగాత్రులయ్యారు. వీరు మద్యం తాగి ఉన్నట్లు పోలీసులు చెబున్నారు.
Comments
Please login to add a commentAdd a comment