సాక్షి ప్రతినిధి, చెన్నై: పెరంబలూరుకు చెందిన ఇద్దరు బాలికలు చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. విడదీయలేని స్నేహబంధాన్ని వివాహ బంధంగా మార్చుకునేందకు లింగమార్పిడికి సిద్ధపడ్డారు. ఇంటి నుంచి పారిపోయిన ఇద్దరిని పోలీసులు పట్టుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
వివరాల ప్రకారం.. పెరంబలూరు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు (17) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. ఈనెల 5వ తేదీ కాలేజీకి వెళుతున్నట్లు చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లారు. అనంతరం ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులు పెరంబలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిద్దరూ చెన్నైలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు పెరంబలూరుకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో వారిని విచారించగా విస్తుగొలిపే వాస్తవాలు వెలుగుచూశాయి.
ఆరో తరగతి నుంచే ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉండేది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు. వీరిలో నర్సింగ్ చదువుతున్న విద్యార్థినికి మగవారి చెప్పులు, దుస్తులు ధరించడం, క్రాఫ్ చేసుకోవడం వంటి లక్షణాలు అలవడ్డాయి. జీవితాంతం ఇద్దరం కలిసి ఉండాలంటే ఒకరు మగవారిగా మారి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ముందుగా చెన్నైలో వైద్య పరీక్షలు చేయించుకుని ముంబయికి వెళ్లి లింగమార్పిడి శస్త్రచికిత్సకు సిద్ధపడుతున్న తరుణంలో శుక్రవారం వీరు చెన్నై పోలీసులకు చిక్కారు. ఇద్దరు విద్యార్థినులను తల్లిదండ్రులకు అప్పగించి చైల్డ్‌లైన్ ద్వారా కౌన్సిలింగ్ ఇస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment