నెడ్ ప్రైస్(ఫైల్ ఫొటో: రాయిటర్స్)
వాషింగ్టన్: అఫ్గనిస్తాన్‌తో తమ దౌత్య సంబంధాల్లో నూతన అధ్యాయం ప్రారంభమైందని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ అన్నారు. ‘ఆగస్టు 30న అఫ్గన్ నుంచి బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవడంతో అమెరికా సుదీర్ఘ యుద్ధాల్లో ఒకటి ముగిసింది. కొన్ని వారాల వ్యవధిలోనే దాదాపుగా లక్ష 23 వేల మందికి పైగా అఫ్గన్ పౌరులను, 6 వేల యూఎస్ పౌరులను అమెరికా సంకీర్ణ దళాలు రక్షిత ప్రదేశాలకు తరలించాయి’’ అని పేర్కొన్నారు.
ఇకమీదట కూడా తమ పనిని కొనసాగిస్తామని, అఫ్గన్ ప్రజలను సురక్షితంగా తరలించడానికి, కాబుల్ విమానాశ్రయం పునఃప్రారంభానికి యూఎస్ తమ వంతు సహాయసహకారాలు అందిస్తుందని స్పష్టం చేశారు. ఖతార్ రాజధాని దోహాలోని తమ కార్యాలయం నుంచి అఫ్గన్‌తో దౌత్య సంబంధాలు కొనసాగిస్తామని తెలిపారు. దాదాపుగా వంద మంది అమెరికన్లు ఇంకా అఫ్గన్‌లోనే ఉన్నారని, వాళ్లను సురక్షితంగా దేశానికి తరలించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు నెడ్ ప్రైస్ వెల్లడించారు.
అదే విధంగా.. దేశం వీడాలనుకున్న వారికి ఇబ్బంది కలగకుండా.. తాలిబన్లు ఎటువంటి ఆంక్షలు విధించరాదని, ఇందుకు సంబంధించి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తీర్మానం చేసినట్లు తెలిపారు. ఒకవేళ తాలిబన్లు ఇందుకు సానుకూలంగా స్పందించనట్లయితే, తమ పౌరులను ఎలా తీసుకురావాలో తెలుసునంటూ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు.
చదవండి: US Afghanistan Exit: ఇకపై విదేశీ గడ్డ మీద అడుగుపెట్టకుండానే: బైడెన్
Comments
Please login to add a commentAdd a comment