
కలకత్తా: పశ్చిమబెంగాల్‌లో ఇద్దరు మంత్రులను సీబీఐ అదుపులోకి తీసుకుంది. నారద స్టింగ్ ఆపరేషన్‌లో సీబీఐ అధికారులు సోమవారం తెల్లవారుజామున ఇద్దరు మంత్రులను అరెస్ట్ చేయడం కలకలం రేపింది. మంత్రుల అరెస్ట్‌పై ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కూడా అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.
సోమవారం ఉదయం 9 గంటలకు మంత్రి ఫిర్మాద్ హకీమ్ ఇంటికి కేంద్ర బలగాలు వెళ్లాయి. అతడిని అదుపులోకి తీసుకున్నాయి. మరో మంత్రి సుబ్రతా ముఖర్జీని కూడా సీబీఐ అదుపులోకి తీసుకుంది. దీంతో ఒక్కసారిగా పశ్చిమబెంగాల్‌లో కలకలం రేపింది. ఈ సంఘటనతో అగ్గి మీద గుగ్గిలమైన మమతా వెంటనే సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. వారిద్దరితో పాటు తృణమూల్ ఎమ్మెల్యే మదన్ మిత్రా, ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మేయర్ సోవన్ ఛటర్జీ నివాసాలకు కూడా కేంద్ర బలగాలు చేరుకున్నాయి. విచారణ చేపడుతున్నాయి.
ఇటీవల బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌ఖర్ నారద న్యూస్ చేపట్టిన స్టింగ్ ఆపరేషన్‌లో విచారణ చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో స్పెషల్ కోర్టులో చార్జ్‌షీట్ సీబీఐ దాఖలు చేసింది. దీంతో సీబీఐ దాడులు చేసి వారిని అదుపులోకి తీసుకుంది. మొత్తం నలుగురిని అరెస్ట్ చేయడం పశ్చిమ బెంగాల్‌లో రాజకీయంగా కీలక మలుపు తిరిగింది. దీనిపై కొద్దసేపట్లో సీబీఐ అధికారికంగా వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.
2016 ఎన్నికల సమయంలో నారద న్యూస్ చేపట్టిన స్టింగ్ ఆపరేషన్‌లో వీరంతా కెమెరా ముందే డబ్బు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఓ వ్యాపారవేత్త నుంచి నలుగురు ఎంపీలు, నలుగు మంత్రులు, ఓ ఎమ్మెల్యే డబ్బులు తీసుకుంటున్నట్లు వీడియోలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన సీబీఐ దర్యాప్తు చేపట్టింది. కేంద్రం కక్షపూరితంగా మంత్రులను అరెస్ట్ చేసిందని.. ఓటమితో బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ప్రజాస్వామ్య విలువలు కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment