భర్త చేష్టలతో విసుగుచెంది... | Wife Who Assassinated Her Husband In Visakhapatnam | Sakshi
Sakshi News home page

భర్తను హతమార్చిన భార్య 

Published Sat, Mar 20 2021 12:56 PM | Last Updated on Sat, Mar 20 2021 12:56 PM

Wife Who Assassinated Her Husband In Visakhapatnam - Sakshi

పుండరీకాక్షయ్య(ఫైల్‌)

పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ), విశాఖపట్నం: భర్త చేష్టలతో విసుగుచెందిన ఓ భార్య.. అతన్ని హత్యచేసింది. వన్‌ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం రాత్రి జరిగిన ఈ సంఘటనతో వారి ఇద్దరు పిల్లలు అనాథలుగా మిగిలారు. పోలీసుల కథనం మేరకు.. జీవీఎంసీ 36వ వార్డు ఏవీఎన్‌ కళాశాల సమీపం ద్వారంవారివీధిలో నివాసం ఉంటున్న పూసర్ల పుండరీకాక్షయ్యతో పూసర్ల సాయిరాం అలియాస్‌ పుణ్యవతికి 2001లో వివాహం జరిగింది. వీరికి డిగ్రీ చదువుతున్న కుమార్తె దివ్య (18), పదో తరగతి చదువుతున్న కొడుకు యశ్వంత్‌ (14) ఉన్నారు. కుటుంబాన్ని పోషించుకునేందుకు పుండరీకాక్షయ్య టిఫిన్‌ దుకాణం నడుపుతూ.. క్యాటరింగ్‌ వ్యాపారాన్ని ఎంచుకున్నాడు. ఈ క్రమంలో క్యాటరింగ్‌ పనికి వచ్చే ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

ఈ విషయం ఇంట్లో తెలియడంతో.. ప్రతిరోజూ భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. ఈ సంబంధాన్ని వదులుకోవాలని పలుమార్లు భార్య సూచించినా.. పుండరీకాక్షయ్య పెడచెవిన పెట్టాడు. ఈ నేపథ్యంలో భర్తపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. అతనికి పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. తర్వాత కూడా ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. పెళ్లీడుకొచ్చిన కూతురు ఇంట్లో ఉండగా.. ఇటువంటి సంబంధాలు మంచివి కావని చెప్పి చూసింది. అయినప్పటికీ భర్తలో ఎటువంటి మార్పు రాలేదు. ఈ క్రమంలో పుండరీకాక్షయ్య మద్యానికి బానిసగా మారాడు. అప్పుడప్పుడు మతిస్థిమితం కోల్పోయి విచక్షణారహితంగా భార్య, పిల్లలపై దాడికి దిగేవాడు.

పుణ్యవతి తల్లిదండ్రులు కురుపాం మార్కెట్‌ సమీపంలో నివాసం ఉండడం వల్ల భర్తతో గొడవపడినప్పుడు.. ఆమె పుట్టింటికి వెళ్లి కొన్ని రోజుల తర్వాత వచ్చేది. ఈ నెల 10న ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిన ఆమె.. 18న రాత్రి ఇంటికి వచ్చింది. రాత్రి 11 గంటల సమయంలో భార్యాభర్తల మధ్య ఘర్షణ మొదలైంది. దీంతో తల్లి ఇద్దరు పిల్లలను వంటగదిలో ఉంచి బయట గడియపెట్టింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న పుండరీకాక్షయ్య భార్యపై దాడికి దిగాడు. తనను తాను రక్షించుకునే క్రమంలో పుణ్యవతి అక్కడే ఉన్న ఇనుప గూటంతో భర్త తలమీద బలంగా మోదడంతో పుండరీకాక్షయ్య అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతుడు సోదరి ఇచ్చిన సమాచారంతో పుణ్యవతిని పోలీసులు అదుపులోకి తీసుకుని శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. సీఐ వెంకటనారాయణ పర్యవేక్షణలో కేసు దర్యాప్తు జరుగుతోంది.
చదవండి:
నన్నెందుకు బతికించారు..   
విషాదం: ప్రేమజంట ఆత్మహత్య

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement