పెళ్లంటే ఇద్దరు వ్యక్తులు ఒక్కటిగా చేసే ఓ వేడుక. జీవితంలో ఇదొక మధురమైన జ్ఞాపకంగా కూడా భావిస్తుంటాం. అంతటి ప్రాముఖ్యం ఉంది గనుకే ప్రజలు వివాహాల కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడరు. అయితే కొందరు మాత్రం ఈ వివాహ బంధాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అడ్డదారులు తొక్కడమే కాకుండా ఎంతటి దారుణాలకైన పాల్పడేందుకు వెనకాడడం లేదు. తాజాగా, జమ్మూకాశ్మీర్‌లో ఓ కిలాడీ డబ్బుల కోసం ఏకంగా ఒకరు ఇద్దరు కాదు 27 మందిని పెళ్లి చేసుకొని మోసం చేసింది.
స్కెచ్ వేసిందిలా
వివరాల్లోకి వెళితే.. జమ్మూ కాశ్మీర్ లోని వివిధ ప్రాంతాలలో తమ భార్య కనిపించడం లేదంటూ 12 మంది యువకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ యువకులు ఇచ్చిన ఫొటోలు చూసిన పోలీసులు షాకయ్యారు. ఆ 12 మంది భర్తలు ఇచ్చిన ఫొటోలలో ఉన్నది ఒకే మహిళ కావడమే అందుకు కారణం. దీనిపై కాస్త లోతుగా పోలీసులు విచారణ జరపగా.. కాస్త అటూఇటూగా అందరు చెప్పిన స్టోరీ ఒకేలా ఉంది. ఓ యువతి మధ్యవర్తి సాయంతో పెళ్లి చేసుకోవడం, కొన్ని రోజుల కాపురం చేశాక ఏదో ఒక కారణం చెప్పి కనిపించకుండా పోవడం.. పోతూ పోతూ ఇంట్లో ఉండే డబ్బు, నగలతో ఉడాయించడం.
ఇలా ఆ కిలేడి ఒకరిద్దరు కాదు ఏకంగా 27 మందిని యువకులను పెళ్లి చేసుకుని మోసం చేసింది. అయితే అనుకోకుండా వీరిలో 12 మంది మాత్రమే పోలీస్ స్టేషన్ వరకు రావడంతో ఈ బండారం మోత్తం బయటపడింది. 27 మందిని పెళ్లి చేసుకొని 20 రోజులు వారితో ఉండి.. డబ్బు, బంగారంతో పారిపోయిందని సమాచారం. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె ఫొటో ఆధారంగా మాయలేడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయం గురించి తెలిసిన వారు రకరకాలుగా అనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment