
పసిబిడ్డను ఎత్తుకెళ్లారని ఎస్పీ సత్యయేసుబాబు ఎదుట బోరున విలపిస్తున్న వినయ
సాక్షి, అనంతపురం : ‘అల్లారుముద్దుగా పెంచుకుంటున్న బాబును తన భర్త వెంకటరెడ్డి, అతని బంధువులు బలవంతంగా ఎత్తుకెళ్లారు. ఇదే విషయమై ధర్మవరం డీఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. పాలు తాగే పసికందు సార్ అంటూ కాళ్లావేళ్లా పడ్డా కనికరం చూపలేదు. కేసు తీసుకునేది లేదంటూ డీఎస్పీ రమాకాంత్ సార్‌తో పాటు ఇతర పోలీసులు నోటికొచ్చినట్లు మాట్లాడారు. నా బాబుకు రెండేళ్లు సార్.. ఇప్పుడు వాడెలా ఉన్నాడో సార్.. దయచేసి నా బాబు (శశాంక్‌రెడ్డి)ని నాకు ఇప్పించండి’ అంటూ ఎస్పీ బి.సత్యయేసుబాబు ఎదుట బుక్కపట్నం మండలం దూపంపల్లికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వినయ బోరున విలపించారు.
కొత్త చెరువు సీఐపై ఎస్పీ ఆగ్రహం
ఎస్పీ సత్యయేసుబాబు ఆధ్వర్యంలో స్థానిక డీపీఓ ఆవరణలో సోమవారం ఏర్పాటు చేసిన పోలీస్ స్పందన కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంకటరెడ్డితో పెళ్లై మూడేళ్లయిందని, బాబు పుట్టినప్పటి నుంచి తనను డబ్బు కోసం వేధిస్తున్నాడని ఈ సందర్భంగా బాధితురాలు ఎస్పీకి ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఎస్పీ వెంటనే ధర్మవరం డీఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం కొత్త చెరువు సీఐకు ఫోన్ చేసి వినయ ఘటనపై ఆరా తీశారు. సీఐ చెప్పిన సమాధానంతో ఎస్పీ ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. ‘ఐదేళ్ల వరకూ బిడ్డ తల్లి వద్ద ఉండాలన్న విషయం నీకు తెలియదా? డూ వాట్ ఐ సే... మొదట బిడ్డను తల్లికి అప్పగించే ఏర్పాటు చేయ్’ అంటూ సీఐను ఆదేశించారు. కాగా, ఎస్పీ స్పందన కార్యక్రమానికి మొత్తం 89 ఫిర్యాదులు అందాయి.
చదవండి : ‘దేవుడి అనుగ్రహం కలగాలంటే బిడ్డను బలివ్వాల్సిందే’
అత్యాచారం చేసి.. రూ. 5 చేతిలో పెట్టాడు
Comments
Please login to add a commentAdd a comment