
సాక్షి,టెక్కలి రూరల్( శ్రీకాకుళం): దైవదర్శనం కోసం వచ్చిన మహిళ అనుకోని రీతిలో చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయింది. భర్త.. పిల్లల కళ్లెదుటే ఈ ఘోరం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లావేరు మండలం గుంటుకుపేట గ్రామానికి చెందిన కూనపు రమ (32), భర్త పోలీస్‌లు తమ ఇద్దరు కుమార్తెలు ఎనిమిదేళ్ల దీక్షిత, ఏడేళ్ల యశస్వీతలతో కలిసి టెక్కలి మండలం రావివలసలోని ఎండలమల్లికార్జున స్వామి దర్శనానికి శనివారం వచ్చారు.
స్వామివారి దర్శనం పూర్తయిన తరువాత స్వగ్రామానికి బయలుదేరుతున్న సమయంలో పెద్ద కుమార్తె దీక్షిత బహిర్భూమికి వెళ్తాననడంతో గుడికి సమీపంలో ఉన్న పెద్ద చెరువు వద్దకు తీసుకొని వెళ్లారు. రమ ప్రమాదవుశాత్తు కాలుజారి చెరువులో పడిపోయి నీట మునిగిపోయింది. దీన్ని చూసిన కుమార్తె కేకలు వేయడంతో తండ్రి పోలీసు, స్థానికులు చెరువులో గాలించి అమెను బయటకు తీసి టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. టెక్కలి ఎస్‌ఐ ఎన్.కామేశ్వరరావు సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతురాలి భర్త అయ్యప్ప మాలలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment