
సాక్షి, జగిత్యాలక్రైం: ఓ మహిళను నమ్మించి వంచించాడో ఎస్సై.. పెళ్లి చేసుకోమంటే నిరాకరించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వివాహిత తన భర్త, ఇద్దరు పిల్లలతో కలసి హైదరాబాద్‌లో నివాసం ఉంటోంది. ఏడాది క్రితం జగిత్యాల జిల్లా సరిహద్దు పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఎస్సైకి ఫేస్‌బుక్‌లో సదరు మహిళతో పరిచయం ఏర్పడింది. ఆమెతో ప్రేమాయణం కొనసాగించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. దీంతో వివాహిత కొద్ది రోజుల క్రితం భర్తకు విడాకులు ఇచ్చింది.
అనంతరం రెండు నెలల క్రితం ఎస్సై ఆమెను కరీంనగర్‌లో రహస్యంగా ఉంచాడు. అయితే.. ఎస్సైకి ఇదివరకే పెళ్లి కావడంతో సదరు మహిళను వదిలించుకునేందుకు ప్రయత్నించాడు. మనస్తాపానికి గురైన ఆమె.. వారం క్రితం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తనను ఎస్సై మోసం చేశాడని బాధితురాలు జగిత్యాల డీఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారం చర్చనీయాంశం కావడంతో సదరు ఎస్సై సెలవులో వెళ్లాడు.