పెడన: మండలంలోని నందమూరు పంచాయతీ సత్యనారాయణపురంలో ఓ మహిళ హత్యకు గురైంది. భర్తే ఆమెను హత్య చేశాడని మృతురాలి కుమార్తెలు ఆరోపిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం వేములదీవికి చెందిన పేరం లక్ష్మి(37) మొదటి భర్తకు విడాకులు ఇచ్చి సుమారు ఐదేళ్ల కిందట పెడన మండలం నందమూరు పంచాయతీ సత్యనారాయణపురం గ్రామానికి వచ్చి ఇక్కడ ఉంటోంది. నందమూరు గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ పరసా సూరిబాబు తన భార్యకు విడాకులు ఇచ్చి లక్ష్మిని రెండో పెళ్లి చేసుకున్నాడు. లక్ష్మికి మొదటి వివాహంలో పుట్టిన సంతానంలో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. సూరిబాబు వారితో కలిసి సత్యనారాయణపురంలోనే ఉంటున్నాడు.
నాలుగేళ్ల కిందట లక్ష్మి పెద్దకుమార్తెకు వివాహం చేశారు. ఇటీవల తరుచుగా సూరిబాబు, లక్ష్మిల మధ్య గొడవలు జరుగుతున్నాయి. రెండు రోజుల కిందట సూరిబాబు లక్ష్మితో గొడవపడి ఆమెను గాయపరచడంతో ప్రభుత్వాసుపత్రికి వెళ్లి చికిత్స పొందింది. అనంతరం భర్తపై కేసు పెట్టింది. ఈ కేసు విషయంలో శుక్రవారం ఉదయం కూడా పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం నందమూరు నుంచి కాకర్లమూడి వెళ్లే డొంక మార్గంలో మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సీఐ ఎన్.కొండయ్య, ఎస్‌ఐ మురళి, తమ సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహం లక్ష్మిదిగా గుర్తించారు. ఉదయం పంచాయతీ జరిగిన అనంతరం సూరిబాబు, లక్ష్మి కలసి వెళ్లారని లక్ష్మి కుమార్తెలు లావణ్య, శ్రీదుర్గ చెబుతున్నారు. సూరిబాబే తమ తల్లిని హత్య చేశాడని వారు ఆరోపిస్తున్నారు. మృతురాలి కుమార్తెలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ కొండయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: గుజరాత్ చెడ్డీ గ్యాంగ్ అరెస్ట్: వీళ్ల అరాచకాలు ఒక్కొక్కటిగా..
Comments
Please login to add a commentAdd a comment