ఢిల్లీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు
గ్వాలియర్ (మధ్యప్రదేశ్): పెళ్లయి మూడు నెలలు కూడా కాలేదు అదనపు కట్నం వేధింపులు తీవ్రమయ్యాయి. భర్తతో పాటు వదిన కూడా హింసించడం మొదలుపెట్టింది. వారి ఆగడాలు శ్రుతిమించి ఆ నవ వధువుపై క్రూరంగా ప్రవర్తించారు. వారిద్దరూ కలిసి ఆ అబల నోటిలో యాసిడ్ పోశారు. అనంతరం అగ్గి పెట్టారు. దీంతో ఆమె తట్టుకోలేకపోయింది. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరింది. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో కొన ఊపిరి మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఆమె జీర్ణాశయం మొత్తం దెబ్బతింది. ఈ ఘటన విషయం తెలుసుకున్న మహిళా కమిషన్ ఏకంగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకోకపోతే పోరాటం చేస్తామని హెచ్చరించారు.
ఈ దారుణ సంఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు ఢిల్లీ మహిళా కమిషన్ ఫిర్యాదు చేయడంతో బహిర్గతమైంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్వాలియర్‌లోని డబ్రా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో యువతికి (25) ఈ సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీన వివాహమైంది. పెళ్లయిన కొన్ని రోజులకే అత్తింటి వారు వేధింపులు మొదలుపెట్టారు. అదనంగా కట్నం తీసుకురావాలని ఆమెపై నిత్యం వేధిస్తున్నారు. భర్త శారీరకంగా తీవ్రంగా హింసించేవాడు. అతడికి తోడుగా అతడి సోదరి కూడా చేరి ఆమెకు నరకం చూపించారు. జూన్ 3వ తేదీన వారి ఆగడాలు శ్రుతిమించాయి. ఆ యువతిని తీవ్రంగా కొట్టి భర్త, వదిన కలిసి యాసిడ్ తాగించారు. అంతటితో ఊరుకోకుండా అగ్గి పెట్టారు. వాటి దెబ్బకు ఆమె తాళలేక అరుపులు, కేకలు వేసి నరకం అనుభవించింది.
స్థానికులు వెంటనే స్పందించి ఆమెను ఆస్పత్రికి తరలించారు. స్థానికంగా ప్రాథమిక చికిత్స అనంతరం ఢిల్లీలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో నరకయాతన అనుభవిస్తూ జీవిస్తోంది. యాసిడ్ ప్రభావంతో జీర్ణాశయం పూర్తిగా దెబ్బతింది. కడుపు ముందరి భాగం పూర్తిగా కాలిపోయింది. దీంతో వైద్యులు అతికష్టంగా ఆమెకు తినిపిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్, సభ్యురాలు ప్రమీలా గుప్తా బాధితురాలిని పరామర్శించారు. జరిగిన విషయం తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఈ దారుణంపై మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ సహించలేకపోయారు. వెంటనే ఆమె వివరాలు, ఫొటోలను తీసుకుని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ఫిర్యాదు చేశారు. ఘటన వివరాలు తెలుపుతూ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఎఫ్‌ఐఆర్ నమోదై నెల దాటినా ఇంకా నిందితులను అరెస్ట్ చేయలేదని గుర్తుచేశారు. వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బాధితురాలి దీనస్థితిని ముఖ్యమంత్రికి లేఖలో వివరించారు.
दिल्ली महिला आयोग की अध्यक्षा @SwatiJaiHind और मेंबर @promilagupta24 ने दिल्ली के एलएनजेपी अस्पताल पहुंचकर ग्वालियर की एसिड अटैक सर्वाइवर से मुलाकात की। https://t.co/bv7yg8xopK pic.twitter.com/vGmLWGcV39
— Delhi Commission for Women - DCW (@DCWDelhi) July 20, 2021
Comments
Please login to add a commentAdd a comment