మెదక్ (దుబ్బాక): ఆనందంగా సాగి పోతున్న వారి జీవితంలో విధి వక్రించింది. గుండె పోటు రూపంలో భర్తను బలి తీసుకుంది. నిండు చూలాలైన భార్యకు భర్తను దూరం చేసింది. భర్త చనిపోయి అంత్యక్రియలు ముగిసిన గంటల వ్యవధిలోనే పురిటి నొప్పులు భరిస్తూ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తండ్రి కానరాని లోకాలకు వెళ్లాడు. కనిపించే భాహ్య ప్రపంచంలో బిడ్డ కన్ను తెరిచాడు. నిన్న ఈ లోకాన్ని విడిచి వెళ్లావు. ఇప్పుడు నీ కొడుకు రూపంలో మళ్లీ జన్మించావు అంటూ తీరని దు:ఖంలో మునిగిపోయిన ఆ పచ్చి బాలింతరాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. దేవుడా ఏమిటీ విషమ పరీక్ష అంటూ ఆ ఇల్లాలి వేదన ప్రతీఒక్కరి గుండెను కదిలిస్తోంది. ఇంతటి హృదయ విదారకరమైన సంఘటన మండల కేంద్రమైన మిరుదొడ్డిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
సాఫీగా సాగిపోతున్న జీవితంలో..
మండల కేంద్రానికి చెందిన సాన సత్య లక్ష్మి, రాములు కుమారుడు బాలకిషన్ (28) (భాను) బీఫార్మసీ పూర్తిచేశాడు. మూడేళ్ల క్రితం కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన స్రవంతితో వివాహం జరిగింది. బాలకిషన్ సిద్దిపేటలోని ఓ మెడికల్ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆనందంగా సాగిపోతున్న వీరి జీవితాన్ని చూసి విధికి కన్ను కుట్టిందో ఏమో ఈ నెల 26వ తేదీన బాలకిషన్ గుండెపోటుకు గురయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అప్పటికే బాలకిషన్ భార్య స్రవంతి నిండు చూలాలు. కడుపులో ఉన్న బిడ్డను మోస్తూ భర్త అంత్యక్రియల్లో పాల్గొన్న స్రవంతి దయయ స్థితికి ప్రతీ ఒక్కరూ చలించిపోయారు. గ్రామంలో ప్రతీ ఒక్కరితో సన్నిహితంగా మెలిగే బాలకిషన్ ఇక లేడన్న విషయాన్ని మిత్రులు, సన్నిహితులు, బంధువులు జీర్ణించుకోలేక పోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment