నిత్యశ్రీ(ఫైల్) నిత్యశ్రీ దహనమైన చోటుని పరిశీలిస్తున్న పోలీసులు
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆన్‌లైన్ పాఠాల నేపథ్యంలో చోటుచేసుకున్న గొడవలు ఒక యువతి బలన్మరణానికి దారితీసాయి. శ్మశానంలో అదే యువతి అంతిమ సంస్కారాల చితిపై ఒక యువకుడు సజీవదహనమైన సంఘటన మిస్టరీగా మారింది. విషాదకరమైన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కళ్లకురిచ్చి జిల్లా ఉళుందూర్‌పేట సమీపం మేట్టునన్నావరం గ్రామానికి చెందిన ఆర్ముగం అనే రైతు కుమార్తె నిత్యశ్రీ (19) నర్సింగ్ చదువుతోంది. నిత్యశ్రీ, ఆమె ఇద్దరు సోదరిలు ఒకే సెల్‌ఫోన్ ద్వారా ఆన్‌లైన్ క్లాసులకు హాజరవుతున్నారు. ఈ విషయంలో ముగ్గురు మధ్య గొడవలు పొడచూపగా తండ్రి మందలించారు. ఇందుకు తీవ్ర మనస్తాపం చెందిన నిత్యశ్రీ కొన్నిరోజుల క్రితం ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నం చేసి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రెండురోజుల క్రితం ప్రాణాలు విడిచింది. అదేరోజు ఆమె మృతదేహాన్ని గ్రామంలోని శ్మశానవాటికలో దహనం చేశారు. ( కూతురుతో సహా సినీ నటి అదృశ్యం )
ఇదిలాఉండగా, అదేరోజు రాత్రి 11 గంటల సమయంలో నిత్యశ్రీ శవం దహనం అవుతుండగా ఒక మగ గొంతు ఆక్రందనలు వినపడడంతో శ్మశాన సిబ్బంది గ్రామ ప్రజలకు సమాచారం ఇచ్చారు. మేడాత్తనూరు గ్రామానికి చెందిన మురుగన్ అనే వ్యక్తి తన కుమారుడు రాము (20) గత నెల 31వ తేదీ నుంచీ కనపడడం లేదని రెండురోజుల క్రితం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. నిత్యశ్రీ శవం దహనం అవుతున్న సమయంలో రాము శ్మశానంలో సంచరిస్తుండగా చూసామని అతని స్నేహితులు పోలీసులకు తెలిపారు. నిత్యశ్రీతోపాటు తన కుమారుడు కూడా దహనం అయిపోయి ఉండొచ్చని తండ్రి అనుమానం వ్యక్తం చేశాడు.
నిప్పుల్లోనుంచి తీసిన వాచ్, సెల్‌ఫోన్ విడిభాగాలు
దీంతో జిల్లా ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసులు బుధవారం సాయంత్రం శ్మశానానికి వెళ్లి నిత్యశ్రీని దహనం చేసిన చోట బూడిదను పరిశీలించగా ఒక వాచ్, సెల్‌ఫోన్ విడిభాగాలు దొరికాయి. ఎముకలను పరిశోధన కోసం ఫోరెన్సిక్ నిపుణులు తీసుకెళ్లారు. ఉళుందూర్‌పేట డీఎస్పీ విజయకుమార్ మీడియాతో మాట్లాడుతూ, నిత్యశ్రీ శవం కాలుతున్న మంటల్లో ఒక యువకుడు కూడా దహనమైనట్లు తెలుస్తోందని అన్నారు. అదేరోజున రాము కనిపించకుండా పోవడం, శ్మశాన పరిసరాల్లో సంచరించడం పలు అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. ఫోరెన్సిక్ పరిశోధనల ఫలితాలు వచ్చిన తరువాతనే రాము గురించి నిర్ధారించగలమని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment