అల్లు అర్జున్‌ను అరెస్టు చేస్తే చంద్రబాబును ఏం చేయాలి? | - | Sakshi
Sakshi News home page

అల్లు అర్జున్‌ను అరెస్టు చేస్తే చంద్రబాబును ఏం చేయాలి?

Published Sat, Dec 14 2024 3:33 AM | Last Updated on Sat, Dec 14 2024 12:51 PM

-

సాక్షి, అమలాపురం: హైదరాబాద్‌ సంధ్యా థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతికి అల్లు అర్జున్‌ కారణమని అరెస్ట్‌ చేస్తే.. గత గోదావరి పుష్కరాల తొక్కిసలాటలో 29 మందికి చావుకు కారణమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఎందుకు అరెస్టు చేయలేదని అమలాపురం మాజీ ఎంపీ చింతా అనురాధ ప్రశ్నించారు. అమలాపురంలో శుక్రవారం ఆమె విలేకర్లతో మాట్లాడారు. సంధ్యా థియేటర్‌ దుర్ఘటన చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే దీనికి అల్లు అర్జున్‌ను బాధ్యుడిని చేసి, అరెస్ట్‌ చేయడం అన్యాయమని అన్నారు.

నాడు చంద్రబాబును ఎందుకు అరెస్ట్‌ చేయలేదు
అమలాపురం టౌన్‌: రాజమహేంద్రవరంలో 2015లో జరిగిన గోదావరి పుష్కరాల్లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో జరిగిన తొక్కిసలాటలో 29 మంది చనిపోయారని, నాడు ఆయనను ఎందుకు అరెస్టు చేయలేదని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ ప్రశ్నించారు. తొక్కిసలాట, మృతి కారణంగా ఇప్పుడు సినీ హీరో అల్లు అర్జున్‌ను అరెస్ట్‌ చేయడం ఎంత మాత్రం సబబు కాదని స్పష్టం చేశారు. అమలాపురంలో ఆయన శుక్రవారం రాత్రి స్థానిక మీడియాతో మాట్లాడారు. 

నాడు పుష్కరాల్లో జరిగిన ఘోరానికి చంద్రబాబును అరెస్ట్‌ చేయనప్పుడు.. ఇప్పుడు అల్లు అర్జున్‌ను అరెస్ట్‌ చేయడం తప్పే అవుతుందని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఇదే విషయాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నానని చెప్పారు. ‘ఎన్నో తొక్కిసలాటలు జరుగుతాయి. ఎందరో చనిపోతూంటారు. అలాంటిచోట్లకు వెళ్లిన లెజెండ్‌లను అలా చేయమని ఎవరూ చెప్పరు. యాదృచ్ఛికంగా జరిగిన తొక్కిసలాటలకు వారిని బాధ్యులను చేయడం కరెక్ట్‌ కాదు’ అని అన్నారు. పైపెచ్చు ఆ బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం కూడా ప్రకటించారని గుర్తు చేశారు. ఇలాంటి అరెస్టులను, ఘటనలను ప్రజలు సమర్థించరని హర్షకుమార్‌ స్పష్టం చేశారు.

నేషనల్‌ రోలర్‌ స్కేటింగ్‌లో ప్రతిభ

అంబాజీపేట: నేషనల్‌ రోలర్‌ స్కేటింగ్‌ చాంపియన్‌ షిప్‌ పోటీల్లో ఇసుకపూడి శివారు పెండిపేటకు చెందిన కుంచే హన్షిత్‌ సిల్వర్‌ మెడల్‌ సాధించాడు. కర్ణాటక రాష్ట్రం మైసూర్‌లో ఈ నెల 5 నుంచి 15వ తేదీ వరకూ 62వ నేషనల్‌ రోలర్‌ స్కేటింగ్‌ చాంపియన్‌ షిప్‌– 2024 పోటీలు నిర్వహించారు. 5 నుంచి 7 ఏళ్ల వయసు బాలుర విభాగంలో హన్షిత్‌ పాల్గొని సిల్వర్‌ మెడల్‌ కై వసం చేసుకున్నాడని అతని తల్లిదండ్రులు కుంచే రమేష్‌, శ్వేత శుక్రవారం చెప్పారు. ఇప్పటి వరకూ హన్షిత్‌ పలు పతకాలు సాధించాడు. 2024లో రాయపూర్‌లో జరిగిన ఆరేళ్ల గ్రూప్‌ ఓపెన్‌ నేషనల్స్‌లో గోల్డ్‌, బ్రాంజ్‌ మెడల్స్‌, అక్టోబర్‌లో తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్‌లో జరిగిన ఓపెన్‌ నేషనల్స్‌లో సిల్వర్‌ మెడల్‌, జిల్లా స్థాయి పోటీల్లో గోల్డ్‌, బ్రాంజ్‌ మెడల్స్‌, నవంబర్‌లో జరిగిన ఆంధ్రప్రదేశ్‌ రోలర్‌ స్కేటింగ్‌ అసోసియేషన్‌ నిర్వహించిన 36వ రాష్ట్ర స్థాయి పోటీల్లో సిల్వర్‌, బ్రాంజ్‌ మెడల్స్‌ సాధించాడు. చిన్న వయసులోనే తమ కుమారుడు జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.

16న జాబ్‌మేళా

కాకినాడ సిటీ: కలెక్టరేట్‌లోని వికాస కార్యాలయం ఆధ్వర్యాన ఈ నెల 16న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ప్రాజెక్టు డైరెక్టర్‌ కె.లచ్చారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. టారస్‌ కంపెనీలో బీపీఓ, వరుణ్‌ మోటార్స్‌లో టీమ్‌ లీడర్‌, ఎగ్జిక్యూటివ్‌ సేల్స్‌, అడ్వైజర్‌, పెయింటర్‌ అండ్‌ డెంటర్‌, రిలయన్స్‌ ట్రెండ్స్‌లో రిటైల్‌ సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌, ఇండో ఎంఐఎం, హోండాస్‌ మోబీస్‌, పానసోనిక్‌ అండ్‌ కేఐఎంఎల్‌ కంపెనీల్లో టెక్నీషియన్‌ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ ఉద్యోగాలకు టెన్త్‌, ఇంటర్‌, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్‌ ఉత్తీర్ణులైన 30 ఏళ్ల లోపు వారు అర్హులన్నారు. వీరికి నెలకు రూ.12 వేల నుంచి రూ.18 వేల వరకూ జీతం, ఆయా ఉద్యోగాలను బట్టి ఇన్సెంటివ్‌లు, భోజనం, వసతి, రవాణా సౌకర్యాలు ఉంటాయన్నారు. ఆసక్తి ఉన్న వారు ఆ రోజు ఉదయం 9 గంటలకు కలెక్టరేట్‌ ఆవరణలోని వికాస కార్యాలయానికి సర్టిఫికెట్ల జిరాక్సులతో హాజరు కావాలని లచ్చారావు సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
అల్లు అర్జున్‌ను అరెస్టు చేస్తే  చంద్రబాబును ఏం చేయాలి?1
1/1

అల్లు అర్జున్‌ను అరెస్టు చేస్తే చంద్రబాబును ఏం చేయాలి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement