
అపార అనుభవశాలి సంజీవయ్య
అమలాపురం రూరల్: అపార అనుభవశాలి దామోదరం సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రి పనిచేశారని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో దామోదరం సంజీవయ్య 104వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ సంజీవయ్య ఆశయాలను ఆచరించడమే ఆయనకు అర్పించే నివాళి అన్నారు. సంయుక్త మద్రాసు రాష్ట్రంలో, ఆంధ్రరాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వంలో అనేకసార్లు ఆయన మంత్రి పదవులు నిర్వహించగా, రెండుసార్లు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసిన ప్రత్యేకత ఆయనదన్నారు. 38 ఏళ్ల చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వంలో తెలుగు భాష వాడుక అధికం చేయడం, భూసంస్కరణల అమలు వంటి ఎన్నో నిర్మాణాత్మక కార్యక్రమాలు ఆయన హయాంలో చేపట్టారన్నారు. ఆర్డీవోలు పి.శ్రీకర్, డి.అఖిల, ఏవో విశ్వేశ్వరరావు, సెక్షన్ సూపరింటెండెంట్లు మురళీకృష్ణ, రమణకుమారి ఎల్డిఎం కేశవ వర్మ, జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి పి. జ్యోతిలక్ష్మి దేవి, వికాస జిల్లా మేనేజర్ జి.రమేష్ కలెక్టరేట్ అధికారులు పాల్గొన్నారు.
ఆధార్ ఈ కేవైసీ అప్డేషన్ తప్పనిసరి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాల లబ్ధిని పొందేందుకు ప్రతి ఒక్కరు ఆధార్ నమోదు బయోమెట్రిక్ ఈ కేవైసీ అప్డేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నిషాంతి పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లో ఆధార్ నమోదు, అప్డేషన్, సమస్యల పరిష్కారానికి ప్రతి మూడు నెలలకు ఒకసారి జరిగే సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఆరు సంవత్సరాల లోపు పిల్లలందరూ చైల్డ్ ఆధార్‌ను ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులు, గ్రామ వార్డు సచివాలయాల ద్వారా జనన ధ్రువపత్రాలు పొందుతూ వాటి ఆధారంగా నమోదు చేయించుకోవాలన్నారు. ఐదు సంవత్సరాలు పైబడి ఏడు సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలని సూచించారు. కోనసీమ జిల్లాలో 7–17 సంవత్సరాల మధ్య వయస్సు గల బాల బాలికలు లక్ష మంది వరకు ఉన్నారని వీరందరూ తప్పనిసరిగా సమీపంలోని గ్రామ వార్డు సచివాలయాలు కామన్ సర్వీస్ కేంద్రాలల్లో ఆధార్ బయోమెట్రిక్, అప్డేట్ చేయించుకోవాలని లేని పక్షంలో పాస్‌పోర్ట్, విద్యార్థులకు ఉపకార వేతనాలు ఉన్నత చదువులకు సంబంధించిన ప్రవేశాలలో ప్రభుత్వ పథకాల రాయితీలు పొందడంలో పలు సమస్యలు ఉత్పన్న మవుతాయని స్పష్టం చేశారు. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ సహాయ మేనేజర్ గిరిధర్ జిల్లాలో జీఎస్ డబ్ల్యూ ఎస్, కామన్ సర్వీస్ సెంటర్, పోస్టల్ అధికారులు లీడింగ్ బ్యాంకుల ప్రతినిధులకు ఆధార్ అప్డేషన్‌పై సందేహాలను నివృత్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment