
నెలాఖరులోగా లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించాలి
రాయవరం: పెన్షనర్లు ఈ నెలాఖరులోగా లైఫ్ సర్టిఫికెట్లు అందజేయాలని జిల్లా ట్రెజరీ అధికారి రామనాథం తెలిపారు. రాయవరం సబ్ ట్రెజరీ కార్యాలయాన్ని ఆయన శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా రామనాథం మాట్లాడుతూ ఏటా పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్లు అందజేయాల్సి ఉంటుందన్నారు. అందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ నెలాఖరులోగా ప్రతి పెన్షనరు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉందన్నారు. జిల్లాలో ఉన్న 80 శాతం మంది పెన్షనర్లు ఇప్పటికే లైఫ్ సర్టిఫికెట్లు అందజేశారన్నారు. అనంతరం ఆయన సబ్‌ట్రెజరీ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. కార్యాలయంలో ఆర్థిక లావాదేవీలను పరిశీలించి సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట సబ్‌ట్రెజరీ అధికారులున్నారు.
నేడు స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు
రాయవరం: పాఠశాల విద్యాశాఖ ఆదేశాల ప్రకారం శనివారం స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రతి నెలా నిర్వహించే సమావేశాలను ఇకపై ప్రతి నెలా మూడవ శనివారం నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా జిల్లావ్యాప్తంగా రీఆర్గనైజేషన్ చేసిన 87 స్కూల్ కాంప్లెక్స్‌ల పరిధిలో ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో జిల్లావ్యాప్తంగా 1,582 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల పరిధిలో విధులు నిర్వహిస్తున్న 5,430 మంది ఉపాధ్యాయులు కాంప్లెక్స్ సమావేశాల్లో పాల్గొననున్నారు. సాధారణంగా స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు రెండు రోజుల పాటు నిర్వహించేవారు ఇకపై కేవలం ఒక పూట మాత్రమే కాంప్లెక్స్ సమావేశాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉదయం 11.45 గంటలకు పాఠశాలో మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యార్థులకు అందజేసిన అనంతరం విద్యార్థులను ఇంటికి పంపించనున్నారు. ఉపాధ్యాయులు మధ్యాహ్నం 1గంటకు వారికి కేటాయించిన స్కూల్ కాంప్లెక్స్‌లకు చేరుకుని, సమావేశాల్లో పాల్గొననున్నారు.
కుంభమేళాకు మూడు ప్రత్యేక బస్సులు
రాజమహేంద్రవరం సిటీ: ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాకు రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపో నుంచి శుక్రవారం 3 సూపర్ లగ్జరీ బస్సులు బయలుదేరి వెళ్లాయని జిల్లా ప్రజా రవాణా అధికారి (డీపీటీవో) కుమారి కె.షర్మిల అశోక తెలిపారు. ఈ యాత్రలో భక్తులు కుంభమేళాతో పాటు భువనేశ్వర్, పూరి, కోణార్క్, గయ, బుద్ధగయ, వారణాసి, అరసవిల్లి క్షేత్రాల దర్శనానంతరం తిరిగి 22న రాజమహేంద్రవరం చేరుకుంటారని వివరించారు. ఒక్కో బస్సులో 36 మంది భక్తులు వెళ్లారన్నారు. కార్యక్రమంలో రాజమహేంద్రవరం డిపో మేనేజర్ ఎస్‌కే షబ్నం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment