
స్కూల్ బస్సు ఢీకొని బాలుడి మృతి
గోకవరం: నిత్యం ప్రయాణిస్తున్న స్కూల్ బస్సే ఆ బాలుడి పాలిట మృత్యుకుహరం అయ్యింది. గోకవరం మండలం వెదురుపాక గ్రామంలో స్కూల్ బస్సు కింద పడి ఎల్‌కేజీ విద్యార్థి మృత్యువాత పడ్డాడు. వివరాల ప్రకారం.. ఆ గ్రామానికి చెందిన కుంచే రాంబాబు, మహేశ్వరి దంపతులకు లేకలేక పుట్టిన కుమారుడు వెంకట జితేంద్ర (5). అతన్ని గతేడాది కోరుకొండలోని ఓ ఇంగ్లిషు మీడియం స్కూల్‌లో చేర్పించారు. స్కూల్ బస్సు రోజూ ఉదయం ఉదయం 8.30 గంటలకు వచ్చి గ్రామంలో విద్యార్థులను ఎక్కించుకుని సాయంత్రం తిరిగి 5 గంటల లోపు తిరిగి తీసుకువస్తుంది. ఈ క్రమంలో శనివారం ఉదయం స్కూల్‌కు వెళ్లిన వెంకట జితేంద్ర సాయంత్రం బస్సు దిగిన తరువాత డ్రైవర్ అజాగ్రత్తగా ఉండటంతో బస్సు కింద పడపోవడంతో తలపై నుంచి వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడిన బాలుడిని కుటుంబ సభ్యులు తొలుత కోరుకొండకు తరువాత రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న గోకవరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం అనంతరం డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. దీనిపై ఎస్సై పవన్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన స్కూల్ బస్సును పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
పెళ్‌లైన ఐదేళ్లకు..
కూలీ పనులు చేసుకుని జీవిస్తున్న రాంబాబు, మహేశ్వరి దంపతులకు పెళ్లయిన ఐదేళ్లకు వెంకట జితేంద్ర జన్మించాడు. లేకలేక పుట్టిన కుమారుడిని అల్లారుముద్దుగా పెంచారు. రోజులాగే ఎంతో ఉత్సాహంగా వెళ్లిన కుమారుడు స్కూల్ బస్సు చక్రాల కింద పడి మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో బాలుడి స్కూల్ బ్యాగ్, చెప్పులు రక్తంతో తడిచి ముద్దయి హృదయ విదారకంగా ఉండటాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు.
క్లీనర్ లేకపోవడంతో ఘటన
రోజూ స్కూల్ బస్సు గ్రామంలోని రామాలయం చివరి వీధిలో ఓ కిరాణా షాపు వద్ద బస్సు ఆగుతుంది. ఆ ప్రాంతంలో నలుగురు విద్యార్థులు బస్సు దిగుతుంటారు. నిబంధనల ప్రకారం స్కూల్ బస్సులో డ్రైవర్‌తో పాటు క్లీనర్ ఉండాలి. పిల్లలు దిగిన తరువాత వారిని సురక్షిత ప్రాంతంలో దించి వెళ్లాల్సి ఉండగా శనివారం స్కూల్ బస్సులో క్లీనర్ లేకపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. విద్యార్థులు స్కూల్ బస్సు దిగిన తరువాత బాలుడు వెంకట జితేంద్ర బస్సు ముందు వెళ్లడంతో డ్రైవర్ నిర్లక్ష్యంతో ముందుకు వెళ్లడంతో ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు.
వెదురుపాకలో ఘటన

స్కూల్ బస్సు ఢీకొని బాలుడి మృతి
Comments
Please login to add a commentAdd a comment