
అరవై రోజుల్లో సమస్యల పరిష్కారం
అయినవిల్లి: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార న్యాయస్థానానికి వచ్చిన అర్జీలను అరవై రోజుల్లోపు పరిష్కరిస్తామని సీజీఆర్‌ఎఫ్ ఏపీఈపీడీసీఎల్, విశాఖపట్నం చైర్‌పర్సన్ బి.సత్యనారాయణ అన్నారు. శనివారం అయినవిల్లి విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద వినియోగదారులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏపీలో తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో విద్యుత్ వినియోగదారుల పరిష్కార న్యాయస్థానాలు ఉన్నాయన్నారు. ఇందులో విశాఖపట్నం పరిధిలో శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకూ 11 జిల్లాలు వస్తాయన్నారు. విశాఖపట్నం పరిధిలో 2004 నుంచి 2025 వరకూ విద్యుత్ వినియోగదారుల నుంచి 8,442 ఫిర్యాదులు రాగా 8,364 సమస్యలను పరిష్కరించామని తెలిపారు. ఇంకా 78 సమస్యలు మాత్రమే పరిష్కరించాల్సి ఉందన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14 నాటికి మొత్తం 112 మంది వినియోగదారులు ఫిర్యాదు చేసుకున్నారన్నారు. ఇప్పటికే 34 సమస్యలను పరిష్కరించామన్నారు. అలాగే ఏపీఈపీడీసీఎల్ నుంచి 107 కేసుల్లో విద్యుత్ వినియోగదారులకు రూ.14,26,650 నష్ట పరిహారం చెల్లించామన్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం 1912కు కాల్ చేయవచ్చన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందజేస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఏపీఈపీడీసీఎల్, విశాఖపట్నం ఆర్థిక సభ్యులు షేక్‌బాబర్, స్వతంత్ర సభ్యులు ఎన్.మురళీకృష్ణ, ఏపీడీసీఎల్ ఎస్‌ఈ ఎస్. రాజుబాబు, డీఈటీ వై విజయానంద్, డీఈ కె. రాంబాబు, ఏడీ జి.అన్నవరం, ఏఈ సీహెచ్ రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment